ఒకే దశలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఫలితాలు ఎప్పుడంటే..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడింది. ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది.

By Medi Samrat  Published on  15 Oct 2024 4:34 PM IST
ఒకే దశలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఫలితాలు ఎప్పుడంటే..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడింది. ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది. నవంబర్ 20న రాష్ట్రంలో ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విలేకరుల సమావేశంలో తేదీని ప్రకటించారు. 288 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది.

మహారాష్ట్రలో నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 22 తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ 29గా పేర్కొంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 4 కాగా.. ఓటింగ్ తేదీ నవంబర్ 20.. ఫలితాల తేదీ నవంబర్ 23గా వెల్ల‌డించింది.

ప్రస్తుతం మహారాష్ట్ర 288 అసెంబ్లీ స్థానాల్లో అధికార పార్టీ అంటే మహాయుతి కూటమికి 218 సీట్లు ఉన్నాయి. నివేదికల ప్రకారం.. బీజేపీ 140-150 స్థానాల్లో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది. షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో.. ఎన్సీపీ 55 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది.

మహారాష్ట్రలో కనీసం 110 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అంతే కాదు సీఎం పదవిపై కూడా కాంగ్రెస్ కన్నేసింది. ఉద్ధవ్ పార్టీ శివసేన 90-95 స్థానాల్లో, NCP శరద్ పవార్ 80-85 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. శివసేన (UBT) సెంట్రల్ ముంబైతో సహా కొన్ని మైనారిటీ స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టాలనుకుంటోంది.

ఎన్నికల ప్రకటనకు కొన్ని నిమిషాల ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్‌ను ప్రకటించారు. బీఎంసీ ఉద్యోగులకు రూ.29 వేలు బోనస్ ఇస్తామని ప్రకటించారు. గతేడాది కంటే ఇది మూడు వేలు ఎక్కువ. కిండర్ గార్టెన్ టీచర్లు, ఆశా వర్కర్లకు కూడా బోనస్ లభిస్తుంది.

Next Story