మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కారణంగా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ గురువారం బలపరీక్షకు ఆదేశించారు. ఈ ఆదేశాలపై ఉద్ధవ్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అనర్హత వేటు సంబంధించి కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని పేర్కొంటూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తక్షణమే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు.. బుధవారం సాయంత్రం విచారణకు అంగీకరించింది.
రాష్ట్రంలో ఉద్ధవ్ థాకరే ఫ్రభుత్వానికి సంఖ్యా బలం లేదని, బలపరీక్ష చేపట్టాలని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్‌ను కలిసి తెలపగా.. గురువారం బలపరీక్షకు సిద్ధం కావాలని ఉద్ధవ్‌కు ఆదేశాలు జారీ చేశారు. రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు.. అసెంబ్లీలో బలపరీక్షకు పిలుపునివ్వడం చట్టవిరుద్ధమని శివసేన ఎంపి సంజరు రౌత్ అన్నారు. రేపు బలపరీక్ష నిమిత్తం గువహటిలో మకాం వేసిన రెబల్ ఎమ్మెల్యేలంతా బుధవారం సాయంత్రం అక్కడ నుండి గోవాకు రానున్నారు.. అక్కడ నుండి ముంబయి చేరుకుంటారు.