గత ఏడాది నవంబర్‌లో పార్టీ అవమానకరమైన ఓటమి నుండి ఇంకా శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ బయటకు రాలేకపోతున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో కూడా మోసాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఓటరు జాబితాలో ఎన్నో అనుమానాలు ఉన్నాయని, మహారాష్ట్రలో చోటు చేసుకున్న అవకతవకలే ఢిల్లీలో కూడా పునరావృతమయ్యాయని రౌత్ ఆరోపించారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటరు జాబితాలో అవకతవకలు చేసి బీజేపీ గెలిచిందని, ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే కనిపిస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ చేస్తున్న అవకతవకలపై ఎన్నికల సంఘం మౌనంగా ఉంటోందని విమర్శించారు. ఓటర్ లిస్ట్ లో జరుగుతున్న ఫ్రాడ్ గురించి, మహారాష్ట్రలో కొత్తగా చోటు చేసుకున్న పరిణామాలపై తాము ఎన్నికల సంఘానికి వివరించామని తెలిపారు. మహారాష్ట్రలో చేసిందే ఢిల్లీలో కూడా చేస్తారని తాను అప్పుడే చెప్పానని అన్నారు.
సీరియస్ ఫ్రాడ్ జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుందని సంజయ్ రౌత్ విమర్శించారు. మహారాష్ట్రలో 5 నెలల్లో 39 లక్షల అక్రమ ఓటర్లను చేర్చారని, బీహార్ లో, ఢిల్లీలో కూడా ఇదే జరుగుతుందని తాను చెప్పానని అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్, ఇండియా కూటమిలోని ఇతర మిత్రపక్షాలు కలిసి పోటీ చేసి ఉంటే ఎన్నికల ఫలితాలు మరో విధంగా వచ్చి ఉండేవని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, ఆప్ రెండు పార్టీలకు బీజేపీతోనే పోటీ అయినప్పుడు, బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్, ఆప్ కలిసి పోరారాడితే బాగుండేదని అన్నారు.