మహారాష్ట్ర టూర్ సక్సెస్ అంటున్న బీఆర్ఎస్.. నిప్పులు చెరిగిన శివసేన, కాంగ్రెస్

Maharashtra leaders criticise KCR’s pilgrimage-cum-political tour, BRS remains positive. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ కు ప్రజల మద్దతు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jun 2023 6:00 PM IST
మహారాష్ట్ర టూర్ సక్సెస్ అంటున్న బీఆర్ఎస్.. నిప్పులు చెరిగిన శివసేన, కాంగ్రెస్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ కు ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన పర్యటన సక్సెస్ అయిందంటూ బీఆర్ఎస్ నేతలు ఫుల్ జోష్ లో ఉండగా.. మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రకు అటు దేవాలయాలను సందర్శించడమే కాకుండా పలు ప్రాంతాల్లో రాజకీయ పర్యటనలు చేపట్టారు. షోలాపూర్ జిల్లాలోని పండర్‌పూర్, ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్‌లలో పర్యటన చేశారు. భారీ కాన్వాయ్ తో ఆయన వెళ్లిన సంగతి తెలిసిందే..! కేసీఆర్ మహారాష్ట్ర పాలిటిక్స్ పై మరింత దృష్టి పెట్టారని చెబుతున్నారు. బీఆర్ఎస్ నాందేడ్‌లో మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది.

మహా రాష్ట్రలో బీఆర్‌ఎస్ పార్టీకి ఊహించిన దానికంటే భారీ స్పందన లభించిందని అంటున్నారు. అయితే మహారాష్ట్రలోని శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్‌ నాయకులు మాత్రం కేసీఆర్ పర్యటనపై విమర్శలు గుప్పించారు. ఇంకా బీజేపీ నుండి ఎటువంటి స్పందన రాలేదు. బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారని బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు న్యూస్‌మీటర్‌కి తెలిపాయి. "ఇది చాలా విజయవంతమైన పర్యటన. మా అంచనాలకు మించి ప్రజల నుంచి స్పందన వచ్చింది. మాకు స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఇతరులు పంఢర్‌పూర్‌లోని శ్రీ విఠల్ రుక్మిణి ఆలయానికి, తుల్జాపూర్‌లోని తులా భవానీ ఆలయానికి ప్రార్థనలు చేయడానికి వెళ్లారు. మా రాకకు సంబంధించి స్థానిక బీఆర్ఎస్ నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొంతమంది కొత్త సభ్యులను పార్టీలో చేర్చుకున్నారు, ”అని BRS సీనియర్ నేత, MP కె కేశవ రావు న్యూస్‌మీటర్‌తో అన్నారు. “మాకు అడుగడుగునా అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రజలు వివిధ గ్రామాలలో మమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతించారు. దాదాపు 30,000 మంది బహిరంగ సభకు హాజరయ్యారు." అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ వెంట పర్యటించిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలలో కేశవరావు కూడా ఉన్నారు.

కంబైన్డ్ మెదక్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని, ముఖ్యంగా రైతు బంధు, రైతు భీమా తదితర పథకాల వల్ల రైతులు ఆకర్షితులు అయ్యారు, బీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో సానుకూలత ఏర్పడిందన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని రైతుల మద్దతు మాకు ఉందని అన్నారు. ఇంత మంచి స్పందన రావడం పొరుగు రాష్ట్రంలోని పార్టీలను కుదిపేసింది. మహారాష్ట్రలోని బీఆర్‌ఎస్ నాయకుడు శంకర్ అన్నా ధోంగ్డే మాట్లాడుతూ.. తమకు ప్రజల నుండి చాలా మంచి స్పందన వస్తోందని, మహారాష్ట్ర ప్రజలు మార్పు కోసం తహతహలాడుతున్నారని అన్నారు.

కేసీఆర్ పర్యటనపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. కేసీఆర్ పర్యటనలో హెలికాప్టర్‌లో గులాబీ పువ్వులు కురిపించాలని బీఆర్ఎస్ నేతలు అనుకోగా.. అందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. విఠోబా ఆలయ పరిసరాల్లోని అన్ని రాజకీయ కటౌట్లు, బ్యానర్‌లను తొలగించాలని స్థానిక అధికారులను ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఆదేశించింది.

600 వాహనాల కాన్వాయ్ తో కేసీఆర్ వెళ్లారని మీడియా నివేదికలు తెలిపాయి. అయితే 300 వాహనాలు మాత్రమే ఉన్నాయని ఒక BRS నాయకుడు చెప్పడం వివాదానికి కారణమైంది. అప్పటికీ దాదాపు 300 వాహనాలు అంటే 3 కి.మీ పొడవని అన్నారు. పంఢర్‌పూర్ వారిస్ యాత్ర కారణంగా స్థానిక పోలీసుల నుండి మార్గమధ్యంలోని ఉమర్గా, ఇతర ప్రాంతాలలో కేసీఆర్ కాన్వాయ్ కు అడ్డంకులు ఎదురయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలను పంపించడానికి మొదట అనుమతి నిరాకరించారు. అయితే తాము యాత్రకు ఆటంకం కలిగించమని బీఆర్ఎస్ నేతలు హామీ ఇవ్వడంతో మహారాష్ట్ర పోలీసులు కాన్వాయ్ ను ముందుకు పోనిచ్చారు.

ఇక ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రార్థనలు చేయడానికి వస్తే అభ్యంతరం లేదని, భారీ కాన్వాయ్ తో బల ప్రదర్శన చేయడం శోచనీయమని అన్నారు. సార్కోలి గ్రామంలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించడంపై ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడంపై ఈ పర్యటన దృష్టి సారిస్తే బాగుండేదన్నారు. భగీరథ్ భాల్కే బీఆర్‌ఎస్‌లో చేరడాన్ని కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. “భాల్కే 2021 పండర్‌పూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో NCP టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయాడు. అలాంటి వ్యక్తి పార్టీని విడిచిపెట్టినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయనకు టిక్కెట్‌ ఇవ్వాలన్న మా నిర్ణయం తప్పు" అని అన్నారు.

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభావం మహారాష్ట్ర రాజకీయాలపై ఉండదు. కేసీఆర్ డ్రామా చేయాలనుకుంటే అందుకు తెలంగాణ చాలు. తెలంగాణలో ఓడిపోతాననే భయం కేసీఆర్ కు పట్టుకుందని, అందుకే మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. కేసీఆర్ డ్రామాలు ఆపాలని, లేకపోతే తెలంగాణలో ఓడిపోవడం ఖాయం. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి 12 నుంచి 13 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని.. మహారాష్ట్రలో మహాకూటమి బలంగా ఉంది. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు అని, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ బలంగా ఉంది. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మహారాష్ట్రలో ప్రతీకారం తీర్చుకుందామని అనుకోకూడదని" సంజయ్ రౌత్ అన్నారు. శివసేన మౌత్ పీస్ దైనిక్ సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన రౌత్ తన పేపర్లో కేసీఆర్ పై మండిపడ్డారు.

మహారాష్ట్రకు చెందిన న్యాయవాది నిఖిల్ కాంబ్లే, కేసీఆర్ పర్యటనపై మాట్లాడుతూ.. మహారాష్ట్ర వేలాది సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. ఆయన పర్యటనపై మహారాష్ట్ర నుంచి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. మహిళలపై దాడులు, పరీక్షల నిర్వహణలో అవినీతి, హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. మహారాష్ట్ర యువత ఉపాధి కోసం ఎదురుచూస్తోంది, ప్రభుత్వం ఎంఎస్‌పి సౌకర్యం కల్పించకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ పరిపాలనలోని తెలంగాణలోనూ ఈ సమస్యలు ఉన్నాయి. 600 కార్లతో చేసిన ఆయన పర్యటనపై మహారాష్ట్రీయులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదన్నారు.


Next Story