జయలలిత 'చిత్రాల' పై మద్రాసు హైకోర్టు కీలక తీర్పు
Madras High Court dismisses plea against release of Jayalalitha biopics. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పై ఇప్పటికే వెబ్ సిరీస్
By Medi Samrat Published on 18 April 2021 8:39 PM IST
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పై ఇప్పటికే వెబ్ సిరీస్ వచ్చిన సంగతి తెలిసిందే..! త్వరలో 'తలైవి' సినిమా కూడా రాబోతోంది. అయితే వీటిపై జయలలిత మేనకోడలు దీప మద్రాసు హైకోర్టు మెట్లు ఎక్కింది. తన మేనత్త జీవిత ఇతివృత్తాంతంతో తెరకెక్కుతున్న వెబ్ సీరిస్, చిత్రాల్లో తమ కుటుంబానికి వ్యతిరేకంగా అంశాలు ఉన్నట్టు, ఈ చిత్రాలు, వెబ్ సీరియల్స్‌పై స్టే విధించాలని కోరింది. అయితే మద్రాసు హై కోర్టు వారి మాటలను పట్టించుకోలేదు.. ఆమె వాదనను మద్రాసు హై కోర్టు తోసి పుచ్చింది.
జయలలిత జీవిత ఇతివృత్తాంత చిత్రాలు, వెబ్ సిరీస్ లకు వ్యతిరేకంగా దీప దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసి పుచ్చింది. దివంగత సీఎం జయలలితకు వారసులు తామే అని ఆమె మేన కోడలు దీప, మేనళ్లుడు దీపక్ చెబుతూ ఉన్నారు. జయలలిత జీవిత ఇతివృత్తాంతతో తెరకెక్కిన క్వీన్, తలైవి, జయ సినిమాలను వ్యతిరేకిస్తూ దీప కోర్టును ఆశ్రయించారు. తన మేనత్త జీవిత ఇతివృత్తాంతంతో తెరకెక్కుతున్న వెబ్ సీరిస్, చిత్రాల్లో తమ కుటుంబానికి వ్యతిరేకంగా అంశాలు ఉన్నాయని.. ఈ చిత్రాలు, వెబ్ సీరియల్స్‌పై స్టే విధించాలని కోరారు.
మొదట ఈ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ విచారించింది. ఈ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ తోసి పుచ్చడంతో అప్పీలుకు దీప వెళ్లారు. హైకోర్టు బెంచ్ ముందు శుక్రవారం పిటిషన్ విచారణకు రాగా.. తలైవి అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని, ఇందులో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి అంశాలు లేవని చిత్ర దర్శకుల తరఫున వాదనలు కోర్టుకు చెప్పారు. ఆమె అనుమతి పొందాల్సిన అవసరం లేదని కూడా చిత్ర బృందం చెప్పడంతో.. వారి వాదనలతో మద్రాసు హై కోర్టు ఏకీభవించింది. దీప వాదనను కోర్టు తోసి పుచ్చింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను ధ్రువీకరిస్తూ.. చిత్రాలకు లైన్ క్లియర్ చేస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో జయలలిత మీద తీసిన, తీస్తున్న చిత్రాలపై ఎటువంటి అడ్డంకులు లేకుండా పోయాయి.