మధ్యప్రదేశ్ జట్టు ఆదివారం తొలిసారిగా రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఆదిత్య శ్రీవాస్తవ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ జట్టు 41 సార్లు ఛాంపియన్ అయిన ముంబైని 6 వికెట్ల తేడాతో ఓడించింది. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబైపై మధ్యప్రదేశ్‌కు ఇది మొదటి విజయం. చివరి రోజున ముంబైని 259 పరుగులకు ఆలౌట్ చేశారు మధ్యప్రదేశ్ బౌలర్లు. రంజీ ట్రోఫీలో గత 5 సీజన్లలో 4 టైటిల్స్ కొత్త జట్లే సాధించడం విశేషం. మధ్యప్రదేశ్ జట్టు సౌరాష్ట్ర, విదర్భ, గుజరాత్ వంటి జట్ల లిస్టులోకి చేరింది.
టైటిల్ గెలిచాక మధ్యప్రదేశ్ ఆటగాళ్లు తమ కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో కలిసి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా, 1988-89 సీజన్‌లో మధ్యప్రదేశ్ జట్టును మొదటి సారి ఫైనల్‌కు నడిపించినది చంద్రకాంత్ పండిట్. అప్పట్లో బెంగళూరులో కర్ణాటక చేతిలో ఓడిపోయింది. 23 ఏళ్ల తర్వాత ఆయన కోచ్ గా ఉన్నప్పుడే ఎంపీ టైటిల్ గెలిచింది.
రెండో ఇన్నింగ్స్ లో ముంబయి జట్టు 269 పరుగులు చేయగా, మధ్యప్రదేశ్ ముందు 108 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. 4 వికెట్ల నష్టానికి మధ్యప్రదేశ్ ఈ లక్ష్యాన్ని అధిగమించి రంజీ టైటిల్ ను ఒడిసిపట్టింది. 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హిమాన్షు 37 పరుగులతో టాప్ స్కోర్ చేయగా, శుభం శర్మ 30 పరుగులు చేశాడు. రజత్ పాటిదార్ 30 పరుగులతో అజేయంగా నిలిచి విజయాన్ని అందించాడు.