రూ. 2.5 కోట్ల కుంభకోణం.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ మహిళా తహసీల్దార్ అరెస్ట్‌

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ టెలివిజన్ షోలో రూ. 50 లక్షలు గెలుచుకుని పాపులారిటీని సంపాదించిన మహిళా తహసీల్దార్‌ అరెస్ట్ అయ్యారు.

By -  Medi Samrat
Published on : 27 March 2026 5:50 PM IST

రూ. 2.5 కోట్ల కుంభకోణం.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ మహిళా తహసీల్దార్ అరెస్ట్‌

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ టెలివిజన్ షోలో రూ. 50 లక్షలు గెలుచుకుని పాపులారిటీని సంపాదించిన మహిళా తహసీల్దార్‌ అరెస్ట్ అయ్యారు. రూ. 2.5 కోట్ల వరద సహాయ నిధికి సంబంధించిన “కుంభకోణం”లో ఆమె ప్రమేయం ఉందన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

బరోడా తహసీల్‌లో 2021లో జరిగిన అవకతవకల ఆరోపణల కేసులో అమితా సింగ్ తోమర్‌ను అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. ఆమెను కోర్టులో హాజరుపరిచి శివపురిలోని జైలులో ఉంచారు.

“బరోడా సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (ఎస్‌డిఓపి) అవనీత్ శర్మ నేతృత్వంలోని బృందం గ్వాలియర్‌లోని చంద్రవద్ని నాకా వద్ద ఉన్న ఆమె ఇంటి నుంచి తోమర్‌ను అరెస్టు చేసింది. తోమర్ విజయ్‌పూర్ తహసీల్దార్‌గా ఉండేవారు, కలెక్టర్ అర్పిత వర్మ ఆమెను ఆ పదవి నుంచి తొలగించారు,” అని అధికారులు తెలిపారు. తోమర్ గతంలో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే ఆమె అప్పీళ్లు తిరస్కరించారు.

2021 వరద సహాయ నిధి 'కుంభకోణం' కేసులో ఇప్పటివరకు 22 మంది పట్వారీలు (రెవెన్యూ అధికారులు), ఒక తహసీల్దార్‌ను అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. ఈ కుంభకోణంలో నిధుల దుర్వినియోగం కోసం రూ. 2.5 కోట్లను నకిలీ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (కేబీసీ)లో పోటీదారుగా పాల్గొని తోమర్ రూ. 50 లక్షలు గెలుచుకున్నారు.

Next Story