కాంగ్రెస్ నేత దారుణ హత్య.. ఉద్రిక్తత!

Madhya Pradesh Congress Leader Shot Dead. మధ్యప్రదేశ్ రాష్ట్రం చత్తార్పూర్ జిల్లాలో దారుణ హత్య జ‌రిగింది.

By Medi Samrat  Published on  17 March 2021 1:58 PM GMT
Madhya Pradesh Congress Leader Shot Dead

మధ్యప్రదేశ్ రాష్ట్రం చత్తార్పూర్ జిల్లాలో దారుణ హత్య జ‌రిగింది. జిల్లాలోని గువారా బ్లాక్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఇంద్ర‌ ప్ర‌తాప్ సింగ్ ప‌ర్మార్‌ను దుండ‌గులు అతి స‌మీపం నుంచి ఛాతీపై కాల్పులు జరిపి హతమార్చారు. ఇక్కడ గత కొంత కాలంగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. మృతుడు 45 ఏళ్ల ఇంద్ర ప్రతాప్ సింగ్ పర్మార్‌ ప్రస్తుతం గువారా బ్లాక్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి ఇంద్ర‌ ప్ర‌తాప్‌.. మిత్రులతో కలిసి స్థానికంగా ఉండే ఓ హోటల్‌ ముందు నిలబడి ఉండగా, బైక్‌పై వ‌చ్చిన ఇద్దరు దుండ‌గులు ఆయ‌న‌పై కాల్పులు జ‌రిపి పారిపోయారు.


స్థానికులు హుటాహుటిన అతనిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీక‌రించారు. ఆయన హత్యపై ఛత్తార్పూర్ ఎస్పీ లోకేంద్ర సింగ్ మాట్లాడుతూ... ఇంద్ర పరతాప్ సింగ్ బాదమల్హారాలోని ఓ హోటర్ వద్ద దుండగులు కాల్పులు జరిపి ఉంటారని అన్నారు. ఈ ఘటనలో మొత్తం 6 వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాట చేశామనీ... త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.

పాత కక్షలే ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో గుర్తించామనీ.. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తమ నేత ఇంద్ర ప్రతాప్‌ హ‌త్య‌తో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన అనుచరులు ఆసుపత్రిని ధ్వంసం చేసి, ప‌రిస‌ర ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించారు. ఇంద్ర ప్రతాప్‌ హ‌త్య‌పై ఉన్న‌త‌ స్థాయి ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు క‌మ‌ల్‌నాథ్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు దిగ్విజ‌య్ సింగ్ డిమాండ్ చేశారు. సీసీటీవీ ఫూటేజి ఆధారంగా అల్లర్లు సృష్టించిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Next Story
Share it