పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి లోక్‌సభ లో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. డిసెంబర్ 13న లోక్‌సభలో ఇద్దరు ఆగంతుకులు గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ నుంచి పొగను వదిలాడు. లోక్‌సభలోకి దూకిన వ్యక్తి.. ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. అనంతరం భద్రతా సిబ్బందికి అప్పగించారు. జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో భద్రతపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.
22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. 2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్ ప్రాంగణంలో కాల్పులు జరిపారు. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వీరిలో ఆరుగురు దిల్లీ పోలీసులు కాగా.. ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు.