లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం సభలో వీగిపోయింది. ప్రతిపక్షాల నినాదాలు, తీవ్ర నిరసనల మధ్య నిర్వహించిన వాయిస్ ఓటు ద్వారా ఈ తీర్మానాన్ని సభ తిరస్కరించింది. అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడగా, తిరిగి స్పీకర్ ఓం బిర్లానే సభాపతిగా బాధ్యతలు చేపట్టి, ప్రతిపక్షాల ప్రవర్తనపై ప్రకటన చేయనున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్పీకర్ తొలగింపు తీర్మానం తీసుకురావడం పార్లమెంటరీ చరిత్రలో అత్యంత విచారకరమైన మరియు దురదృష్టకరమైన ఘట్టమని ఆయన అభివర్ణించారు. స్పీకర్ అనే వ్యక్తి అధికార, ప్రతిపక్ష పార్టీలకు తటస్థ సంరక్షకుడిగా ఉంటారని, గత నాలుగు దశాబ్దాలలో ఇలాంటి ప్రయత్నం జరగడం ఇదే మొదటిసారి అని షా గుర్తు చేశారు.
బీజేపీ సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎన్నడూ స్పీకర్‌పై అవిశ్వాసం ప్రకటించలేదని ఆయన ఎత్తి చూపారు. సభ అనేది పార్టీల ఇష్టానుసారం కాకుండా, ఖచ్చితమైన నియమ నిబంధనల ప్రకారం నడుస్తుందని, స్పీకర్ సమగ్రతను ప్రశ్నించడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థనే అవమానించడమేనని అమిత్ షా స్పష్టం చేశారు. నియమాలకు విరుద్ధంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు.