పక్క రాష్ట్రం కర్ణాటకలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప. గత కొన్ని రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్న నేఫథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుందని సీఎం యడియూరప్ప పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల పెరుగుదల, అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తుండడంతో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యడియూరప్ప అన్నారు.
లాక్‌డౌన్ నేఫథ్యంలో ఉదయం 10 గంటల తర్వాత ఒక్కరిని కూడా బయటకు అనుమతించబోమని స్పష్టం చేశారు. అన్ని హోటళ్లు, పబ్ లు, బార్లు మూసివేయాలని అన్నారు. ఫలహార శాలలు, మాంసం దుకాణాలు, కూరగాయల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అనుమతిస్తారని వివరించారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు. ఇదిలావుంటే.. గురువారం ఒక్కరోజే కర్ణాటకలో 49,058 పాజిటివ్ కేసులు వచ్చాయి.