ఆ కేసు విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులై గ్రామస్థుల దాడి
Locals attack CBI officials during house raid in Odisha. ఒడిశా రాష్ట్రం దేనకనాల్ జిల్లాలోని ఓ గ్రామంలో కేసు విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులపై స్థానికులు దాడి చేశారు.
By అంజి Published on 17 Nov 2021 8:55 AM ISTఒడిశా రాష్ట్రం దేనకనాల్ జిల్లాలోని ఓ గ్రామంలో కేసు విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులపై స్థానికులు దాడి చేశారు. పూర్తి వివరాల్లోకి వేళ్తే.. ఓ నిందితుడిని తన ఇంట్లో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు సీబీఐ అధికారులపై దాడి చేసి.. వారిని ఇంటిలో బంధించి ఇంటికి తాళం వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి అధికారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆన్‌లైన్‌లో చిన్నారులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ముఠాలే టార్గెట్‌గా సీబీఐ అధికారులు దాడులు చేశారు. దేశంలోని 14 రాష్ట్రాల్లోని 77 ప్రాంతాల్లో సోదాలు చేశారు.
ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం 7 గంటలకు దేనకనాల్ జిల్లాకు చెందిన మిథున్ నాయక్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేసేందుకు వెళ్లారు. కొన్ని గంటల పాటు నిందితుడిని విచారిస్తున్న క్రమంలో అతడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కర్రలతో దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన సీబీఐ బృందం సహాయం కోసం స్థానిక పోలీసులను పిలిచింది. వెంటనే గ్రామానికి చేరుకుని బందీలుగా ఉన్న సీబీఐ అధికారులను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సోదాలకు సంబంధించి సీబీఐ అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, స్థానికులు తమకు సమాచారం అందించిన తర్వాతే తమకు తెలిసిందని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన తర్వాత, స్థానిక పోలీసులు మిథున్ నాయక్‌ను పిలిచి అదుపులోకి తీసుకున్నారు, అతను రెండు నెలల క్రితం దేశీ MMS అనే గ్రూపులో చేరినట్లు అంగీకరించాడు. తాను వివిధ సోషల్ మీడియా గ్రూప్‌లలో వీడియో లింక్‌లను షేర్ చేసేవాడినని, దానికి బదులుగా 21 డాలర్లు ఇచ్చేవారని చెప్పాడు. ఆన్‌లైన్ పిల్లల లైంగిక వేధింపుల రాకెట్‌పై సీబీఐ విచారణ జరుపుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం, 2019తో పోలిస్తే 2020లో పిల్లలపై సైబర్ నేరాలు 400 శాతం పెరిగాయి. గత సంవత్సరం, పిల్లలపై సైబర్ నేరాలకు సంబంధించి 842 కేసులు నమోదు కాగా, 2019లో 164 కేసులు నమోదయ్యాయి.