ఉత్తరభారతంపై పిడుగుల బీభత్సం.. 68 మంది మృతి
Lightning kills 68 across Rajasthan, UP, MP. ఉత్తర భారతదేశంలో ప్రకృతి బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా ప్రాంతాల్లో
By Medi Samrat Published on 12 July 2021 4:35 PM IST
ఉత్తర భారతదేశంలో ప్రకృతి బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా ప్రాంతాల్లో పిడుగులు పడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం మూడు రాష్ట్రాల్లో పిడుగులు పడిన కారణంగా 68 మంది మరణించారు. పలువురికి గాయాలు అయ్యాయి.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో 41 మంది, రాజస్థాన్ లో 20 మంది, మధ్యప్రదేశ్ లో ఏడుగురు మరణించారు. యూపీలోని ఒక్క ప్రయాగ్ రాజ్ జిల్లాలోనే 14 మంది పిడుగుపాటుతో మరణించారని అధికారులు చెబుతున్నారు.
మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిహారం ప్రకటించారు. పశువులు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందేజేస్తామని హామీ ఇచ్చారు. ఈ మరణాల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు. మధ్యప్రదేశ్ లోని షియోపూర్, గ్వాలియర్, శివపురి జిల్లాల్లో పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని 12వ శతాబ్దం నాటి ఆమిర్ ప్యాలెస్ పై పిడుగు పడింది. ఆ కోటలోని వాచ్ టవర్ పైకి ఎక్కిన పర్యాటకులు పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. పిడుగుపడిన సమయంలో టవర్ పై 27 మంది దాకా ఉన్నారు. చాలా మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.