ఉత్తరాఖండ్‌లో పోటెత్తిన వరద.. ఆరుగురు మృత్యువాత

Latest Uttarakhand floods news. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. వరద పోటెత్తుతోంది. వాగులు, నదులు భారీ వరద ఉధృతితో

By అంజి  Published on  19 Oct 2021 3:49 AM GMT
ఉత్తరాఖండ్‌లో పోటెత్తిన వరద.. ఆరుగురు మృత్యువాత

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. వరద పోటెత్తుతోంది. వాగులు, నదులు భారీ వరద ఉధృతితో ప్రవహిస్తున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఆరుగురు మృత్యువాత పడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ముగ్గురు నేపాలీ వాసులు ఉన్నారు. అలాగే కాన్పూర్‌ చెందిన టూరిస్ట్‌, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఇక కేదార్‌నాథ్‌ ఆలయానికి వెళ్లి.. అక్కడే వరదలో చిక్కుకున్న 22 మంది భక్తులను సహాయక సిబ్బంది, పోలీసులు కలిసి కాపాడారు.

వరద పోటెత్తడంతో పెద్ద మొత్తంలో రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో నైనిటాల్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. బద్రీనాథ్‌ జాతీయ రహదారికి సమీపంలోని లాంబగడ్‌ నల్లాహ్‌ వద్ద వరదలో చిక్కుకున్న కారు క్రేన్‌ సహాయంతో సహాయక సిబ్బంది బయటకు తీశారు. భారీ వర్షాలతో నందాకిని నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో వైపు భారీ వర్షాలు కురుస్తుండడంతో చార్‌ధామ్‌ యాత్రను తత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చార్‌ధామ్‌ యాత్రకే వెళ్లిన భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు.

కేరళ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి కొందరు గల్లంతు కాగా, మరికొందరు నీట మునిగారు. దీంతో ఇప్పటి వరకు 35 మందికిపైగా మృతి చెందారు. వర్షాల కారణంగా కేరళలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ ద్వారా రక్షిస్తున్నారు. వరద బాధితుల కోసం 247 క్యాంపులను సీఎం పినరయి విజయన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Next Story
Share it