గోవా దూద్‌సాగర్ వద్ద రైలు ప్రమాదం
Landslides on rail line near Goa-Karnataka border. గోవాలోని దూద్‌సాగర్ జలపాతం వద్ద మంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న రైలు పట్టాలు
By Medi Samrat Published on 23 July 2021 11:16 AM GMTగోవాలోని దూద్‌సాగర్ జలపాతం వద్ద మంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న రైలు పట్టాలు తప్పింది. రైలు పట్టాలపై కొండచరియలు విరిగి పడడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. సోనాలిమ్, దూద్ సాగర్ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. గోవా సిఎం ప్రమోద్ సావంత్, ఉపముఖ్యమంత్రి బాబు అజ్ గోయంకర్ ఘటనాస్థలిని సందర్శించారు. తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇంజిన్ మరియు మొదటి జనరల్ కోచ్ పట్టాలు తప్పాయి. ప్రయాణీకులు ఎవరూ గాయపడలేదు.పట్టాలు తప్పిన కోచ్‌లోని ప్రయాణికులను ఇతర కోచ్‌లకు తరలించారు. రైలును కులేమ్‌కు తిరిగి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఎస్‌డబ్ల్యుఆర్ ప్రకటన విడుదల చేసింది.
మహారాష్ట్రలోని చిప్లున్ కామతే మధ్య వశిష్టి నది పొంగిపొర్లుతున్న కారణంగా మద్గావ్-లోండా-మిరాజ్ మీదుగా మళ్లించిన సిఎస్‌టి టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్, దూద్ సాగర్-సోనౌలిమ్ విభాగంలో పట్టాలు తప్పింది. కొండచరియలు విరిగిపడిన కారణంగా రైలు నెం. 02780 హజ్రత్ నిజాముద్దీన్ - వాస్కో డా గామాకు బయలుదేరిన వాస్కో డా గామా ఎక్స్‌ప్రెస్ స్పెషల్‌ను కారంజోల్ మరియు దూద్ సాగర్ మధ్య నిలిచిపోయింది. ఈ రైలును తిరిగి క్యాజిల్ రాక్‌కు రప్పించేశారు.
01134 రైలులో ఉన్న 345 మంది ప్రయాణికులు, రైలు నెంబర్ 02780 లో ఉన్న 887 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకులను తీసుకెళ్లేందుకు బస్సులను ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్కో డా గామా, బెలగావి, హుబ్బల్లి వంటి గమ్యస్థానాలకు లోండా నుండి బస్సుల ఏర్పాటు చేయబడుతుంది. ప్రయాణీకుల అభిప్రాయాల ఆధారంగా మద్గావ్ లేదా మంగళూరు జంక్షన్ నుండి ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు రైళ్ల ప్రయాణికుల కోసం క్యాజిల్ రాక్ స్టేషన్ మరియు కులెం స్టేషన్ వద్ద టీ, స్నాక్స్, తాగునీటి ఏర్పాట్లు చేశారు.