మరింత క్షీణించిన లాలూ ఆరోగ్యం
Lalu's health condition deteriorates, to be shifted to AIIMS New Delhi. జైలులో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని
By Medi Samrat Published on 22 March 2022 6:05 PM IST
జైలులో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, మెరుగైన చికిత్స కోసం ఆయన్ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) మెడికల్ బోర్డు అతన్ని ఎయిమ్స్ న్యూఢిల్లీకి రెఫర్ చేసింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రిని మంగళవారం దేశ రాజధానిలోని ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందని వారు తెలిపారు. ప్రసాద్‌కు చికిత్స అందించేందుకు రిమ్స్ ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల వైద్యుల బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ విద్యాపతి మాట్లాడుతూ, ప్రసాద్ పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాలని మెడికల్ బోర్డు సిఫారసు చేసింది. ఆ సిఫార్సును జైలుసూపరింటెండెంట్ కు పంపామని అన్నారు. దాణా కుంభకోణంలో దొరండా ట్రెజరీకి రూ.139 కోట్లు అపహరించిన కేసులో దోషిగా తేలిన ప్రసాద్‌కు ఫిబ్రవరి 21న ప్రత్యేక సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.60 లక్షల జరిమానా విధించింది. ఫిబ్రవరి 15న కోర్టు ప్రసాద్‌ను దోషిగా నిర్ధారించింది.
లాలూ మూత్రపిండ సమస్యలతో సహా అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. ఆయన కిడ్నీ 15-20 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని డాక్టర్ విద్యాపతి తెలిపారు. జార్ఖండ్ ఐజీ, జైళ్ల, మనోజ్ కుమార్ మాట్లాడుతూ, "లాలూ ప్రసాద్‌ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి, ప్రక్రియ ప్రకారం, మెడికల్ బోర్డు సిఫారసుల ఆధారంగా జైలు సూపరింటెండెంట్, మరొక ఆసుపత్రికి తరలించడానికి అధికారిక అనుమతి కోరారు." అని తెలిపారు. డిసెంబరు 2017 నుండి జైలులో ఉన్న లాలూ ప్రసాద్ తన శిక్షా కాలం చాలా వరకు రిమ్స్‌లో అనుభవించారు. గత ఏడాది జనవరిలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తీసుకెళ్లారు.