లాలూ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్
Lalu Prasad Yadav's Kidney Transplant Successful. రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ పూర్తైంది.
By Medi Samrat Published on 5 Dec 2022 4:48 PM ISTరాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ పూర్తైంది. సర్జరీ విజయవంతంగా ముగిసింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సోమవారం ట్వీట్ చేశారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూ కి మార్చారు.. అక్క రోహిణి ఆచార్య కూడా ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రార్థనలకు ప్రత్యేక ధన్యవాదాలని తేజస్వీ యాదవ్ చెప్పుకొచ్చారు. తండ్రిని బెడ్‌పై షిష్ట్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు.
లాలూకు ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేశారు. రోహిణి ఆచార్య నుంచి కిడ్నీ తీసే శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయినట్టు ఆమె సోదరి, లాలూ పెద్ద కుమార్తె మీసా భారతి ప్రకటించారు. ఐసీయూలో రోహిణి చికిత్స పొందుతున్న ఫొటోలను ఫేస్ బుక్ లో షేర్ చేశారు. రోహిణి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు తెలిపారు. ఈ సర్జరీ సింగపూర్‌లోనే జరిగింది. లాలూ సహచరుడు భోళా యాదవ్, తేజస్వీ రాజకీయ సలహాదారుడు సంజయ్ యాదవ్, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, పెద్ద కూతురు మిసా భారతి కూడా సింగపూర్‌లోనే ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీలు చెడిపోవడంతో శస్త్రచికిత్స అనివార్యం అయింది. రక్త సంబంధీకులు కిడ్నీ దానం చేస్తే సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుందని వైద్యులు చెప్పడంతో లాలూ కుమార్తె రోహిణి ముందుకు వచ్చారు. ఇప్పుడు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో అటు కుటుంబంలోనూ, ఇటు లాలూ అభిమానుల్లోనూ ఆనందం వెల్లివిరుస్తోంది.