బెయిల్ దక్కించుకున్న లాలూ

Lalu Prasad gets bail in multi-crore rupees fodder scam case. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్

By Medi Samrat  Published on  17 April 2021 10:21 AM GMT
బెయిల్ దక్కించుకున్న లాలూ

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ దక్కింది. దాణా కుంభకోణంలో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. దాణా కుంభకోణానికి సంబంధించి విడుదలైన నిధుల్లో రూ.3.13 కోట్లు కాజేశారన్న ఆరోపణల కేసులో ఆయన్ను కోర్టు దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది. 2017 డిసెంబర్ నుంచి ఆయన జైలులోనే గడుపుతున్నారు. ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేరిన ఆయన అక్కడే చికిత్స పొందారు.

ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఎయిమ్స్ కు ఆయన్ను తరలించారు. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో ఇప్పటికే మూడింటికి ఆయనకు బెయిల్ లభించింది. ఇప్పుడు దుమ్కా ట్రెజరీ కేసుకు సంబంధించి బెయిల్ పొందారు. నాలుగు కేసుల్లోనూ బెయిల్ పొందడంతో ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ చేసిన వెంటనే ఆయన ఇంటికి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. అయితే ఆయన ఆరోగ్యం ఇప్పటికే చాలా వరకూ క్షీణించిందని ఆయన సన్నిహితులు తెలిపారు. 72 సంవత్సరాల లాలూ ప్రసాద్ యాదవ్ ఎయిమ్స్ లోచికిత్స తీసుకుంటూ ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆసుపత్రిలో ఉండడంతో ఆర్జేడీ పగ్గాలను ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ స్వీకరించాడు. తేజస్వి తక్కువ సమయంలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.


Next Story
Share it