చెలరేగిన హింస.. రైతులపైకి దూసుకెళ్లిన కాన్వాయ్.. 8 మంది మృతి..!

Lakhimpur Kheri violence. ఉత్తరప్రదేశ్‌లో రైతుల ఆందోళనలో హింస చేలరేగింది. కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన

By అంజి  Published on  4 Oct 2021 3:08 AM GMT
చెలరేగిన హింస.. రైతులపైకి దూసుకెళ్లిన కాన్వాయ్.. 8 మంది మృతి..!

ఉత్తరప్రదేశ్‌లో రైతుల ఆందోళనలో హింస చేలరేగింది. కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై కేంద్రమంత్రి కాన్వాయ్‌కు సంబంధించిన కారు దూసుకెళ్లింది. లఖీమ్‌పూర్‌ఖేరీలో జరిగిన ఈ ఘటనలో నలుగురు రైతులతో పాటు మరో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. టికునియాలో ఓ కార్యక్రమంలో కేంద్రహోంశాఖ సహాయ మంత్ర అజయ్‌ మిశ్రా, ఉపముఖ్యమంత్రి సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రికి వ్యతిరేకంగా రైతులు రోడ్డుపైకి వచ్చి నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. అదే సమయంలో రైతులు అటుగా వచ్చిన కేంద్రమంత్రి కాన్వాయ్‌ నిరసన తెలుపుతున్న రైతులపైకి దూసుకెళ్లింది. కారు కింద పడి నలుగురు రైతులు మృతి చెందారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు మూడు వాహనాలను తగలబెట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులపైకి దూసుకెళ్లిన కారులోని ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఒక డ్రైవర్‌ చనిపోయినట్టు ఏఎస్పీ అరుణ్‌ కుమార్‌ సింగ్ వెల్లడించారు. అయితే కారులో కేంద్రమంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా ఉన్నాడని పలువురు రైతులు ఆరోపించారు. కాగా హింస తర్వాత లఖీమ్‌పూర్‌ ఖేరీలో ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈ ఘటనపై కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా స్పందించారు. ఈ సంఘటనను కుట్రగా అభివర్ణించారు. రైతుల రాళ్ల దాడితో తమ కారు బోల్తా పడిందని అన్నారు. ప్రమాదం తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని అన్నారు. నిరసనకారులపైకి దూసుకెళ్లిన వాహనంలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నాడన్న ఆరోపణలను అజయ్‌ మిశ్రా ఖండించారు.. రైతులపై కాన్వాయ్‌ దూసుకెళ్లిన ఘటనను కిసాన్ మోర్చా నేత రాకేష్ టికాయత్‌ ఖండించారు. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ... రైతుల హత్య ఘటనగా ఆరోపించారు. వెస్ట్ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. లఖీపూర్‌ఖేరీలో జరిగిన ఘటనను 'అనాగరిక ఘటన' అంటూ ఖండించారు. టీఎంసీ ఎంపీల బృందం బాధిత కుటుంబాలను పరామర్శిస్తుందని తెలిపారు. రైతుల పట్ల బీజేపీకి ఉన్న ఉదాసీనత నన్ను తీవ్రంగా బాధించిందని దీదీ అన్నారు. లఖీమ్‌పూర్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లవద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి.. అసలు విషయాలు బయట పెడుతుందని సీఎం యోగి అన్నారు. అయితే లఖీమ్‌పూర్‌ ఖేరీ ఘటనను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ద్వారా కాకుండా.. సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి ద్వారా విచారణ జరిపించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండ్ చేసింది.



Next Story