Kolkata Doctor Case : ఆ దారుణం జరిగిన రాత్రి మరో మహిళను కూడా వేధించాడు

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు విచారణలో నేరం అంగీకరించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి

By Medi Samrat  Published on  26 Aug 2024 1:48 PM GMT
Kolkata Doctor Case : ఆ దారుణం జరిగిన రాత్రి మరో మహిళను కూడా వేధించాడు

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు విచారణలో నేరం అంగీకరించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. విచారణ సమయంలో.. సంజయ్ రాయ్ నేరం జరిగిన రాత్రి తాను చేసిన పనులను వివరించాడు. నగరంలోని రెండు రెడ్ లైట్ ఏరియాలను కూడా సందర్శించినట్లు అంగీకరించాడు. అయితే అతను వీధిలో ఒక మహిళను వేధించినట్లు కూడా అంగీకరించాడు. అతడు చేసిన పని నిఘా కెమెరాలలో కూడా బంధించారు. రాయ్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ చేసి న్యూడ్ ఫోటోలు కూడా అడిగానని ఒప్పుకున్నాడు.

ఆగస్టు 8న రాయ్ తన స్నేహితుడితో కలిసి RG కర్ ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడ చేరిన స్నేహితుడి సోదరుడి గురించి ఆరా తీశాడు. రాత్రి 11:15 గంటలకు, రాయ్, అతని స్నేహితుడు ఆసుపత్రి నుండి బయలుదేరి మద్యం సేవించాలని నిర్ణయించుకున్నారు. రోడ్డుపై మద్యం కొని తాగారు. ఉత్తర కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియా సోనాగాచిని సందర్శించాలని వారు నిర్ణయించుకున్నారు. సోనాగచ్చిలో అనుకున్నది జరగకపోవడంతో వారు దక్షిణ కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియా అయిన చెట్లాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చెట్లాకు వెళ్తుండగా రోడ్డుపై ఓ అమ్మాయిపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారు. చెట్లాలో అతని స్నేహితుడు ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. రాయ్ బయట నిలబడి తన స్నేహితురాలితో వీడియో కాల్‌లో మాట్లాడాడు. రాయ్ తన స్నేహితురాలిని న్యూడ్ ఫోటోల కోసం అడిగాడు, ఆమె పంపింది.

రాయ్, అతని స్నేహితుడు ఆసుపత్రికి తిరిగి వచ్చారు. రాయ్ నాలుగో అంతస్తులోని ట్రామా సెంటర్‌కి వెళ్లాడు. తెల్లవారుజామున 4:03 గంటలకు, రాయ్ మూడో అంతస్తులోని సెమినార్ హాల్ సమీపంలోని కారిడార్‌కు వెళ్లడం CCTV ఫుటేజీలో కనిపించింది. బాధితురాలు నిద్రిస్తున్న సెమినార్ హాల్‌లోకి ప్రవేశించిన రాయ్ ఆమెను గొంతు నులిమి చంపాడు. రాయ్ బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, ఆ తర్వాత ఘటనాస్థలిని విడిచిపెట్టి కోల్‌కతా పోలీసు అధికారి, స్నేహితుడైన అనుపమ్ దత్తా ఇంటికి వెళ్లాడు.

నిందితుడు కొంతమంది సీనియర్‌ కోల్‌కతా పోలీసు అధికారులకు సన్నిహితంగా ఉండేవాడు. వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్యని కప్పిపుచ్చేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నించారని, దర్యాప్తు చేపట్టే సమయానికి క్రైమ్ సీన్ మారిపోయిందని సీబీఐ గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది.

Next Story