హెల్మెట్ లేకుంటే పెట్రోల్ కొట్టమని గతంలో పలు చోట్ల ఫోటోలు దర్శనం ఇచ్చాయి. చాలా రాష్ట్రాల్లో కూడా ఈ పద్దతిని అమలు చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ అది అంత గొప్పగా అమలు అవ్వలేదు. తాజాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో పోలీసులు సరికొత్త నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తూ ఉన్నారు. ఇక మీదట హెల్మెట్ ధరించకపోతే.. బంకుల్లో వారికి పెట్రోల్ పొయకూడదంటూ కోల్‌కతా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 8 నుంచి కోల్‌కతా పరిధిలో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
హెల్మెట్ ధరించకుండా బంకుల్లోకి వచ్చే టూ వీలర్ వాహనాలకు పెట్రోల్ పోయకూడదని ఉత్తర్వులు జారీ చేశామని పోలీస్ కమిషనర్ అనూజ్ శర్మ అన్నారు. బైక్ నడిపేవారితో పాటు.. వెనక ఉన్నవారికి కూడా హెల్మెట్ తప్పనిసరి అని చెబుతూ ఉన్నారు. డిసెంబర్ 8 నుంచి వచ్చే 2021 ఫిబ్రవరి 2 వరకు ఈ ఉత్తుర్వులు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఇక్కడ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సరికొత్త ఆఫర్ ను కూడా ఇస్తోంది. హెల్మెట్ ను ప్రభుత్వమే అందిస్తుందట. హెల్మెట్ ను కొనలేని వారికి రాష్ట్ర ప్రభుత్వమే వాటిని అందజేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. హెల్మెట్ ధరించి బైక్‌లు నడపండి. హెల్మెట్ కొనలేని వారు మీ సమీప పోలీసు స్టేషన్‌కి వెళ్లి.. మీ వివరాలు వారికి ఇస్తే.. మీకు హెల్మెట్ ఇస్తారని ఆమె అభయం ఇచ్చారు. ప్రభుత్వమే హెల్మెట్ ఉచితంగా ఇస్తున్నా కూడా పెట్టుకోకపోతే అది పౌరుల నిర్లక్ష్యం కిందకే వస్తుంది.