'70 ఏళ్లుగా రాజ్యాంగాన్ని కాపాడింది కాంగ్రెస్సే'.. బీజేపీపై నిప్పులు చెరిగిన ఖర్గే

Kharge attacks BJP, says Congress saved Constitution for 70 years. జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే గురువారం ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు.

By అంజి  Published on  6 Jan 2023 2:06 PM IST
70 ఏళ్లుగా రాజ్యాంగాన్ని కాపాడింది కాంగ్రెస్సే.. బీజేపీపై నిప్పులు చెరిగిన ఖర్గే

జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే గురువారం ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్‌ రాజ్యాంగాన్ని కాపాడిందని అన్నారు. ''గత 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రధాని మోదీ ఎప్పుడూ అడుగుతుంటారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడిందని, అందుకే ఆయనలాంటి వ్యక్తి ప్రధాని కాగలడని, నాలాంటి పేదవాడి కొడుకు ఏఐసీసీ అధ్యక్షుడయ్యాడని నేను ఆయనకు చెప్పాలనుకుంటున్నాను'' అని బీహార్‌లోని బంకా జిల్లాలో 'భారత్ జోడో యాత్ర'ను ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ చేసిన కృషి గురించి ఖర్గే మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ ఎలాంటి సహకారం అందించలేదన్నారు. ఆ పార్టీ కార్యకర్తలు ఎవరూ జైలుకు వెళ్లలేదన్నారు. ''బీజేపీ దేశానికి స్వాతంత్ర్యం పోరాడలేదు. వారి కార్యకర్తలు ఎవరూ జైలుకు వెళ్లలేదు. కాంగ్రెస్ భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది. దేశ అభివృద్ధికి దోహదపడింది'' అని ఖర్గే అన్నారు. మతం పేరుతో సమాజాన్ని విభజించి పేదలను అణిచివేసేందుకు అధికార పార్టీ పనిచేస్తోందని బీజేపీపై మండిపడ్డారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్ పాద యాత్రను ముగించుకుని గురువారం హర్యానాలో ప్రవేశించింది. గురువారం హర్యానాలో తిరిగి ప్రవేశించిన యాత్ర జనవరి 5 నుంచి 10 మధ్య రాష్ట్రంలోని నాలుగు జిల్లాల గుండా వెళుతుంది. జనవరి 5 సాయంత్రం ఉత్తరప్రదేశ్ నుండి పానిపట్ జిల్లాలోని సనౌలీ ఖుర్ద్ గ్రామం గుండా యాత్ర హర్యానాలోకి ప్రవేశించింది. యాత్ర ఇవాళ ఉదయం సనోలి-పానిపట్ రోడ్డు నుండి తిరిగి ప్రారంభమైంది. మధ్యాహ్నం పానిపట్‌లో బహిరంగ సభ జరుగనుంది. ఇందులో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు.

Next Story