భారత ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియోను విడుదల చేశారు.ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసినందుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. 2025 ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే కుంభమేళాలో మోదీని, యోగిని టార్గెట్ చేస్తామన్నారు.
ఖలిస్తానీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌కు తమ ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ కుంభమేళా జరిగే సమయంలో తప్పకుండా సమాధానం చెబుతుందని పన్నూన్ అన్నారు. 2025 జనవరి 14, జనవరి 29, ఫిబ్రవరి 3న దాడులు చేస్తామని హెచ్చరించారు. ఆ రోజుల్లో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్‌లో ఉంటారని, ఈ మహా కుంభ్ ఇద్దరు నాయకులకు చివరిదిగా మారుస్తామని పన్నూన్ హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో యూపీ, పంజాబ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ముగ్గురు ఖలిస్తానీ టెర్రరిస్టులను మట్టుబెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. ఘటనాస్థలంలో రెండు ఏకే-47 రైఫిల్స్, రెండు గ్లాక్ పిస్టల్స్, భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.