రానున్న ఐదేళ్లలో కీలక నిర్ణయాలు: ప్రధాని మోదీ

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

By అంజి  Published on  3 July 2024 8:30 AM GMT
PM Modi, National news, Rajya Sabha, Central Govt

రానున్న ఐదేళ్లలో కీలక నిర్ణయాలు: ప్రధాని మోదీ

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ప్రతిపక్షం హయాంలో రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వాన్ని నడిపిందన్నారు. పదేళ్లుగా అఖండ సేవాభావంతో ఎన్డీయే ముందుకెళ్తోందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుస్తామన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్త ఉత్సవాలు నిర్వహించాలన్నారు. దేశ అభివృద్ధికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్తామని రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, పంటల కనీస మద్ధతు ధరలు భారీగా పెంచామని చెప్పారు. అన్నదాతల ప్రయోజనాల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామన్నారు.

పీఎం కిసాన్‌ ద్వారా ఆరేళ్లలో రూ.3 లక్షల కోట్లు పంపిణీ చేశామని వివరించారు. గతంలో సన్నకారు రైతుల కోసం కాంగ్రెస్‌ ఎలాంటి పథకాలు తేలేదని ప్రధాని విమర్శించారు. పేదరికంపై పోరులో వచ్చే ఐదేళ్లు కీలకమని ప్రధాని మోదీ అన్నారు. సమిష్టి కృషితో ఈ పోరులో దేశ ప్రజలు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని మోదీ పేర్కొన్నారు. భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన రోజున ఆ ప్రభావం ప్రజల జీవితాలపై ఉంటుందన్నారు. వికసిత్‌ భారత్‌, ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం చేస్తున్న కృషికి మద్ధతుగా ప్రజలు తమను మూడోసారి గెలిపించారని తెలిపారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమకు మూడోసారి అవకాశం ఇచ్చి తెలివైనవారని నిరూపించుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. వారి తెలివి తేటలు, ముందుచూపు చూసి గర్విస్తున్నామని వ్యాఖ్యానించారు.

ప్రజలు పని తీరుకే ప్రాధాన్యత ఇచ్చి, ఉత్తి మాటలు చెప్పేవారికి బుద్ధి చెప్పారన్నారు. రానున్న ఐదేళ్లు కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుపడ్డారు. ఆయన మాట్లాడుతుండగా ప్రధాని అబద్ధాలు ఆపాలి, నీట్‌పై చర్చ చేపట్టాలని అని నినాదాలు చేశారు. చివరికి వారంతా మోదీ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ వారిపై విమర్శలు గుప్పించారు. సభను విపక్షాలు అనుమానిస్తున్నాయని, నిజాలు చెబుతుంటే భరించడం లేదన్నారు. చర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారని విమర్శించారు. కాగా నిన్న లోక్‌సభలోనూ ప్రధాని మోదీ ప్రసంగం సందర్భంగా విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.

Next Story