బస్సులను కేజీ 45 రూపాయలు చొప్పున అమ్ముతున్న కేరళ యజమాని
Kerala owner sells buses for Rs 45 per kg. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది జీవితాలు తారుమారయ్యారు.
By Medi Samrat Published on 12 Feb 2022 7:39 PM IST
కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది జీవితాలు తారుమారయ్యారు. ఎంతో మందిని పేదరికంలోకి నెట్టింది. అలాంటి వారిలో కేరళలోని టూరిస్ట్ బస్సు ఆపరేటర్లు కూడా ఉన్నారు. కేరళకు చెందిన టూరిస్ట్ బస్సు ఆపరేటర్ తన బస్సులను కిలో 45 రూపాయలకు విక్రయిస్తున్నారు. కేరళలోని బస్సు యజమానుల సంఘం అయిన కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేటర్స్ అసోసియేషన్ (CCOA) ప్రకారం, మహమ్మారి సమయంలో రాష్ట్రంలో మొత్తం టూరిస్ట్ బస్సుల సంఖ్య 14,000 నుండి 12,000కి తగ్గింది.
రాయ్ టూరిజం యజమాని కొచ్చికి చెందిన రాయిసన్ జోసెఫ్ తన బస్సులను స్క్రాప్ రేటుకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారు. గత 12-18 నెలల్లో తన 20 టూరిస్ట్ బస్సుల్లో 10 విక్రయించానని, ప్రయాణ ఆంక్షలు తమను తీవ్రంగా దెబ్బతీసాయని ఆయన చెప్పారు. "ఈ వారంలో మొదటి మూడు రోజుల్లో మూడు బస్సులు మాత్రమే మున్నార్‌కు ట్రిప్పులు వెళ్లాయి. సాధారణంగా ఫిబ్రవరిలో మున్నార్‌కు వెళ్లే రోడ్లు విపరీతమైన ట్రాఫిక్‌ను చూస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు" అని ఆయన చెప్పారు.
CCOA రాష్ట్ర అధ్యక్షుడు బిను జాన్ తెలిపిన వివరాల ప్రకారం, గత రెండు నెలల్లోనే బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు వెయ్యికి పైగా టూరిస్ట్ బస్సులను తమ సొంతం చేసుకున్నారు. మార్చి తర్వాత కచ్చితమైన లెక్కలు బయటకు వస్తాయని తెలిపారు. ఆదివారం లాక్‌డౌన్‌లు వారికి భారీ నష్టాన్ని కలిగించాయి. రోడ్డుపన్ను అధికంగా చెల్లిస్తున్న నేపథ్యంలో టూరిస్టు బస్సుల నిర్వాహకులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రతి టూరిస్ట్ బస్ ఆపరేటర్ ప్రతి త్రైమాసికానికి కనీసం రూ.40,000 రోడ్డు, వాహన పన్ను చెల్లిస్తున్నారు. ఇంధనం ధర ఎక్కువగా ఉండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. అన్ని కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసే వరకు ప్రభుత్వం పన్నును ఉపసంహరించుకోవాలని ఆపరేటర్లు కోరుతున్నారు.