లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేఖపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం స్పందించారు. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలను కలిసేందుకు అంగీకరించినట్లు ఢిల్లీ ఎల్‌జీ తన లేఖలో పేర్కొన్నారు. అయితే, 70-80 మంది ఎమ్మెల్యేలతో తనను కలవాలని సీఎం కోరగా అందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తిరస్కరించారు. వీకే సక్సేనా హెడ్ మాస్టర్ లా ప్రవర్తిస్తూ ఉన్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజకీయాలను పక్కనపెట్టి దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్ధితిపై దృష్టి సారించాలని అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీలో గూండాల నైతిక స్థైర్యం పెరిగి చివరికి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కే భద్రత లేని పరిస్ధితి దాపురించిందని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిరోజులు రాజకీయాలను పక్కనపెట్టి నగరంలో శాంతి భద్రతలపై దృష్టిసారించాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో తాము ఆయనకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కోరుకుంటే అయిదు నిమిషాల్లో మా ఎమ్మెల్యేలు ఆయనను కలుస్తారని చెప్పారు కేజ్రీవాల్.