కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పెంచుకోడానికి కావాలనే అలాంటి పనులు చేస్తున్నారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని.. ఉద్దేశపూర్వకంగానే మామిడిపండ్లు తింటున్నారని

By Medi Samrat  Published on  18 April 2024 4:45 PM IST
కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పెంచుకోడానికి కావాలనే అలాంటి పనులు చేస్తున్నారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని.. ఉద్దేశపూర్వకంగానే మామిడిపండ్లు తింటున్నారని, రక్తంలో చక్కెర స్థాయిని పెంచడం కోసం కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఢిల్లీ కోర్టులో పేర్కొంది. రోస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి రాకేష్ సియాల్ ముందు ఈ విషయాన్ని తెలియజేస్తూ.. బెయిల్ కోసం కారణాలను సృష్టించేందుకు ఇది ఒక ప్రాతిపదిక అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హొస్సేన్ అన్నారు. సీఎం కేజ్రీవాల్‌ షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉన్నాయని చెబుతుండగా.. ఆయన జైల్లో మామిడిపళ్లు, స్వీట్లు, వగైరా తింటున్నారని హొస్సేన్‌ వివరించారు.

ఈ వాదనలను సీఎం కేజ్రీవాల్ తరపు న్యాయవాది వివేక్ జైన్ వ్యతిరేకించారు. మీడియాలో హైలైట్ అవ్వడానికి ఈడీ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుని సరైన పిటిషన్‌ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. విచారణ తర్వాత, కోర్టు సీఎం డైట్‌పై తీహార్ జైలు అధికారుల నుండి వైద్య నివేదికను కోరింది. తిరిగి శుక్రవారం విచారణ చేస్తున్నామని వాయిదా వేసింది. తన బ్లడ్ షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తన షుగర్ లెవల్స్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తన వైద్యుడ్ని సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Next Story