కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది.
By Medi Samrat Published on 23 Jan 2024 8:56 PM ISTబీహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం భారతరత్న ఇవ్వనున్నారు. దివంగత సోషలిస్టు నాయకుడి జయంతికి ఒకరోజు ముందు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది. "అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అచంచలమైన నిబద్ధత, ఆయన దార్శనిక నాయకత్వం భారతదేశ సామాజిక-రాజకీయాలపై చెరగని ముద్ర వేశాయి" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
కర్పూరీ ఠాకూర్ 1924 జనవరి 24న జన్మించారు. కర్పూరీ ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. ఆయన రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పని చేశారు. 1970 నుంచి 1971 వరకు మొదటిసారి, 1977 నుంచి 1979 వరకు రెండోసారి సీఎంగా పని చేశారు. బీహారీలు ఆయనను 'జన్ నాయక్'గా పిలుచుకుంటారు. బీహార్ రాజకీయాల్లో ప్రభావవంతమైన వ్యక్తిగా మిగిలిపోయారు. గోకుల్ ఠాకూర్, రామ్దులారి దేవి దంపతులకు ఆయన జన్మించారు. పితౌంఝియా అనే చిన్న గ్రామంలో జన్మించిన నాయీ సామాజిక వర్గానికి చెందిన కర్పూరీ ఠాకూర్ ముఖ్యమంత్రిస్థాయికి ఎదిగారు.
1970లలో బీహార్ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న సమయంలో సమాజంలోని అణగారిన వర్గాలకు ఎంతో మేలు జరిగింది. సోషలిస్ట్ అయిన ఠాకూర్ తన విద్యార్థి రోజులలో జాతీయవాద ఆలోచనలతో తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆ తరువాత ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో భాగమయ్యారు. విద్యా మంత్రిగా, ఠాకూర్ మెట్రిక్యులేషన్ స్థాయిలో ఇంగ్లీషును తప్పనిసరి సబ్జెక్ట్‌గా రద్దు చేశారు, ఇది చాలా మంది విద్యార్థులకు పోటీ పరీక్షలలో అవరోధంగా ఉండేది. ఆయన అనేక పాఠశాలలు, కళాశాలలను స్థాపించారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలో 8వ తరగతి వరకు ఉచిత విద్యను అందించారు. డ్రాపౌట్ రేట్లను గణనీయంగా తగ్గించారు. ఆయనకు "జన నాయక్" "పీపుల్స్ హీరో" అనే బిరుదును సంపాదించారు.