ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన.. 80 లక్షల హోటల్ బిల్లులపై రచ్చ

ప్రాజెక్ట్ టైగర్ 50 ఏళ్ల జ్ఞాపకార్థం గతేడాది ఏప్రిల్‌లో మైసూరు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన హోటల్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే సోమవారం తెలిపారు

By Medi Samrat  Published on  28 May 2024 10:30 AM IST
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన.. 80 లక్షల హోటల్ బిల్లులపై రచ్చ

ప్రాజెక్ట్ టైగర్ 50 ఏళ్ల జ్ఞాపకార్థం గతేడాది ఏప్రిల్‌లో మైసూరు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన హోటల్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే సోమవారం తెలిపారు. 80 లక్షల వరకు బిల్లు అయిందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి బస చేసిన హోటల్ తన బకాయిలను కర్ణాటక ప్రభుత్వం చెల్లించలేదని.. దీంతో ఆ హోటల్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు మీడియా కథనాలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది.

ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి ప్రముఖులు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ సంప్రదాయమని మంత్రి ఈశ్వర్ ఖండ్రే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే గత ఏడాది ఏప్రిల్‌లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం (ప్రాజెక్ట్ టైగర్) ప్రణాళికలో పాల్గొనలేదు. "ప్రాజెక్ట్ టైగర్‌కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మైసూరు-బందీపూర్‌లో ప్రధాని పర్యటించారు. ఆ సమయంలో, MCC అమలులో ఉంది. ఎన్నికలు ప్రకటించారు. కాబట్టి, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. మొదట్లో దాదాపు రూ.3 కోట్లు వెచ్చించాలని అనుకున్నా, ఖర్చు దాదాపు 6.33 కోట్లు అయింది. కాబట్టి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి 3.3 కోట్లు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖకి దీనికి సంబంధించి లేఖ రాసింది. హోటల్ బిల్లు (రూ. 80 లక్షలు) రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాలని కోరగా.. అది చెల్లించాలని నిర్ణయించుకున్నాము ” అని అన్నారాయన.

Next Story