కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ రెండేళ్ల కాలానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవీ కాలం మే 25తో ముగియనుంది. ప్రవీణ్ సూద్ అదే రోజు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మార్చిలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించడంతో ప్రవీణ్ సూద్ వార్తల్లోకి వచ్చారు. కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేస్తున్న రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌ను అరెస్టు చేయాలని శివకుమార్ డిమాండ్ చేశారు.
ప్రవీణ్ సూద్ కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మూడేళ్ల క్రితమే రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. ఆయన స్వస్థలం హిమాచల్ ప్రదేశ్. IIT-ఢిల్లీ పూర్వ విద్యార్థి. ఆయన మే 2024లో పదవీ విరమణ చేయవలసి ఉండగా.. ప్రస్తుత బాధ్యతల రీత్యా 2 సంవత్సరాల స్థిర పదవీకాలం పొందుతారు. మే 2025 వరకు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగుతారు.
ప్రవీణ్ సూద్‌తో పాటు మధ్యప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనా, సీనియర్ ఐపీఎస్ తాజ్ హాసన్ పేర్లు కూడా సీబీఐ డైరెక్టర్ నియామక రేసులో ఉండగా.. చివరికి ప్రవీణ్ సూద్ నే పదవి వరించింది.