కర్ణాటకలో సోమవారం నుండి రాత్రి కర్ఫ్యూ ఎత్తి వేస్తూ ఉన్నారు. బెంగళూరులోని పాఠశాలలు, కళాశాలలు కూడా తిరిగి తెరవనున్నారు. కోవిడ్ కారణంగా ఇప్పుడు ఆసుపత్రిలో చేరడం 2 శాతం కాగా.. రికవరీ రేటు పెరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. "సోమవారం నుండి COVID19 ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా అమలు చేయడంతో పాటూ.. అన్ని తరగతులకు చెందిన వారూ పాఠశాలకు రావాల్సి ఉంటుంది" అని కర్ణాటక విద్యా మంత్రి BC నగేష్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితిపై సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
సవరించిన మార్గదర్శకాలలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతానికి బదులుగా పూర్తి సామర్థ్యంతో నడుస్తాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, పబ్బులు, బార్‌లు కూడా పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించబడ్డాయి. అవి ఇప్పటివరకు 50 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయి. థియేటర్లు, ఆడిటోరియంలు, మల్టీప్లెక్స్‌లలో 50 శాతం సామర్థ్యం కొనసాగుతుంది. జిమ్‌లు మరియు స్విమ్మింగ్ పూల్‌లు కూడా 50 శాతం సామర్థ్యంతో పనిచేయనున్నాయి. మెట్రో రైలు మరియు ఇతర ప్రజా రవాణా సిట్టింగ్ సామర్థ్యంతో నడుస్తుంది. క్లోజ్డ్ ప్రాంతంలో 200 మంది సభ్యులు, ఆరుబయట 300 మంది సభ్యులతో వివాహ కార్యక్రమాలు అనుమతించబడతాయి. సామాజిక, మత, రాజకీయ ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు, నిరసనలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.