కర్ణాటక బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విద్యా రంగానికి సంబంధించి సంచలన నిర్ణయాలు ప్రకటించారు. విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'రోహిత్ వేముల బిల్లు'ను తీసుకువస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు డీమ్డ్ యూనివర్సిటీల్లో విద్యార్థులపై కుల ఆధారిత దాడులు, వివక్షను నిరోధించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. తెలంగాణలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల మరణం తర్వాత, ఇలాంటి వివక్షను అడ్డుకోవాలని రాహుల్ గాంధీ కోరిన నేపథ్యంలో సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఈ బిల్లుకు తుది ఆమోదం లభించనుంది.
దీనితో పాటు, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలను తిరిగి ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. విద్యా రంగం అభివృద్ధి కోసం UVCE సంస్థను రూ.500 కోట్లతో IIT తరహాలో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) సహకారంతో రూ.2,500 కోట్ల వ్యయంతో ప్రభుత్వ కళాశాలలు, పాలిటెక్నిక్‌లను మోడల్ సంస్థలుగా అభివృద్ధి చేస్తామని, విద్యార్థులలో స్టార్టప్ సంస్కృతిని పెంచేందుకు తొమ్మిది 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ఏర్పాటు చేస్తామని సిద్ధరామయ్య వెల్లడించారు.