విషాదంగా ముగిసిన 'వైర‌ల్‌ వీడియో' ట్రిక్

Karnataka Man's Stunt With 3 Cobras Ends Badly. కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి మూడు పాములను ముందు ఉంచుకుని చేసిన స్టంట్‌లో ఊహించని

By Medi Samrat
Published on : 17 March 2022 9:30 PM IST

విషాదంగా ముగిసిన వైర‌ల్‌ వీడియో ట్రిక్

కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి మూడు పాములను ముందు ఉంచుకుని చేసిన స్టంట్‌లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మూడు పాముల్లో ఒక పాము అతనిపై దాడి చేయడంతో వీడియో ట్రిక్ కాస్తా విషాదంగా ముగిసింది. సిర్సీకి చెందిన మాజ్ సయ్యద్ అనే స్నేక్ లవర్ మూడు నాగుపాములను ముందు ఉంచుకుని వీడియోను చిత్రీకరించాడు. ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది. అతను పాముల ముందు వంగి ఉండటం, వాటి తోకలను లాగడం, అతని చేతులను కదిలించడం మొదలుపెట్టాడు.

దీంతో ఆ పాములు దూకుడుగా స్పందించాయి. సయ్యద్‌ YouTube ఛానెల్ నిండా ఇలాంటి వీడియోలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఫుటేజీలో పాము అతడి పైకి దూసుకెళ్లి అతని మోకాలిని కొరికేస్తోంది. షాక్‌కు గురైన వ్యక్తి దానిని లాగేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది.

ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేస్తూ.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా పాములతో ఆడుకునే వారిని విమర్శించారు. నాగుపాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని, మన కదలికలను బెదిరింపులుగా భావిస్తాయని అన్నారు. కొన్నిసార్లు, ప్రతిస్పందన ప్రాణాంతకం కావచ్చని విమర్శించారు.

స్నేక్‌బైట్ హీలింగ్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు ఫౌండర్ అయిన ప్రియాంక కదమ్ షేర్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ లో సయ్యద్ ని నాగుపాము కాటువేయడంతో ఆసుపత్రి పాలైనట్లు వెల్లడించింది. సయ్యద్ చేసిన స్టంట్ కారణంగా అతనికి 46 యాంటీ-వెనమ్ వయల్స్ ను ఇచ్చారు వైద్యులు.
















Next Story