కుమార్తె వర్షంలో ఆన్ లైన్ క్లాస్ వింటూ ఉండగా.. గొడుగు పట్టిన తండ్రి
Karnataka man holds umbrella as daughter attends online class on roadside amid heavy rains. లాక్ డౌన్ సమయంలో ఎందరో పిల్లలు ఆన్ లైన్ లో క్లాసులకు
By Medi Samrat
లాక్ డౌన్ సమయంలో ఎందరో పిల్లలు ఆన్ లైన్ లో క్లాసులకు హాజరు అవుతూ ఉన్నారు. నగరాల్లో ఉన్న వాళ్లకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, హై స్పీడ్ ఇంటర్నెట్ వంటివి లభిస్తూ ఉంటాయి. కానీ గ్రామాల్లో పరిస్థితి వేరేలా ఉంది. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ క్లాసుల్లో తమ పిల్లలు పాల్గొనడానికి తల్లి దండ్రులు కూడా తమ వంతు ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. తాజాగా ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అందులో తన కుమార్తె ఆన్ లైన్ క్లాసు కోసం తండ్రి గొడుగు పట్టుకుని మరీ నిలబడ్డారు.
భారీ వర్షాల మధ్య ఒక అమ్మాయి తన ఆన్‌లైన్ క్లాస్‌కు హాజరవుతుండగా.. ఆమె తండ్రి తన తలపై గొడుగు పట్టుకొని ఆమె పక్కన నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సుల్లియా తాలూకాలోని మారుమూల గ్రామమైన బల్లకాలో చిత్రీకరించారు. భారీ వర్షాలు పడటంతో అమ్మాయి రోడ్డు పక్కన కూర్చుని ఆన్‌లైన్ ఎస్‌ఎస్‌ఎల్‌సి క్లాస్ తీసుకునేటప్పుడు ఆమె తండ్రి నారాయణ గొడుగు పట్టుకొని ఉన్నారు. ఈ చిత్రాన్ని సుల్లియాకు చెందిన మహేష్ పుచ్చప్పడి అనే జర్నలిస్ట్ క్లిక్ చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు అమ్మాయి అదే స్థలానికి వస్తుందని ఆయన అన్నారు.
గ్రామీణ దక్షిణ కన్నడ జిల్లాలో ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యను ఈ ఫోటో హైలైట్ చేస్తుంది. "ఇది వారికి రోజువారీ దినచర్య. అయితే, ఇప్పుడు భారీ వర్షం కారణంగా అమ్మాయి తండ్రి గొడుగు పట్టుకున్నాడు.. అందువల్ల అతని కుమార్తె తరగతులకు అవుతోంది. మంచి నెట్‌వర్క్ ఉన్న స్థలం దొరకకపోతే విద్యార్థులు చాలా కష్టాలు పడాల్సి వస్తోందని" అతను టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. గుత్తిగార్, బల్లక, కమీలా విద్యార్థులు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి.. ఇంటర్నెట్ కనెక్షన్ దొరికే చోటులో కూర్చుని.. తరగతులకు హాజరుకావడం సర్వసాధారణమని మహేష్ తెలిపారు.
స్థానిక నివాసితులు ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌పై ఆధారపడతారు. ఈ ప్రాంతంలో విద్యుత్ కోతలు ఉన్నప్పుడు మొబైల్ పనిచేయదు. ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి కనీసం 3 జి నెట్‌వర్క్ అవసరం.. కొన్ని సార్లు అసలు ఇంటర్నెట్ రాదని తెలుస్తోంది. బిఎస్‌ఎన్‌ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్, కన్స్యూమర్ ఫిక్స్‌డ్ యాక్సెస్ జిఆర్ రవి మాట్లాడుతూ, "బ్యాండ్‌విడ్త్ లేని ప్రాంతాల్లో భారత్ ఎయిర్‌ఫైబర్ ఇంటర్నెట్‌ను అందించి మేము దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము" అని తెలిపారు.