కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక సర్కార్ మరోమారు లాక్‌డౌన్ పొడిగించింది. దీంతో వచ్చే నెల 7వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. మే 24 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉండగా.. నిపుణుల సూచనల మేరకు జూన్ 7వ తేదీ వరకూ పొడిగించినట్లు సీఎం మీడియాకు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుకున్నట్లు సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం యడియూరప్ప మాట్లాడుతూ.. లాక్‌డౌన్ విదించినా కొంతమంది ఉదయం 10 గంటల తరువాత కూడా బయట తిరుగుతూ ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని.. అనవసరంగా బయట తిరిగే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను సీఎం యడియూరప్ప ఆదేశించారు. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరారు. ఇదిలావుంటే.. లాక్‌డౌన్ నేఫథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు మినహాయింపు నిచ్చింది ప్రభుత్వం. అలాగే.. అత్యవసర సర్వీసులతోపాటు వ్యాక్సినేషన్ కోసం వెళ్లే వారికి మినహాయింపు ఉంది.