హిజాబ్ వివాదం.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
Karnataka Hijab Ban Stays, Court Says Not Essential Religious Practice. కర్నాటక హైకోర్టు హిజాబ్ వివాదం కేసులో కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువరించింది.
By Medi Samrat
కర్నాటక హైకోర్టు హిజాబ్ వివాదం కేసులో కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువరించింది. హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది. విద్యాసంస్థలో హిజాబ్ తప్పనిసరి కాదని పేర్కొంటూ.. విద్యార్థులు ప్రొటోకాల్ పాటించాల్సిందేనని పేర్కొంది. తీర్పు వెలువరించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతపరమైన ఆచారంలో భాగం కాదని పేర్కొంది. పాఠశాల యూనిఫాం ధరించడం సహేతుకమైన పరిమితి మాత్రమే. దీనిని విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరు. యూనిఫాం ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు పేర్కొంది. పాఠశాల యూనిఫాం ధరించడం అనేది విద్యాసంస్థల ప్రొటోకాల్ అని.. దీన్ని విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. దీంతో క్లాస్‌లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడాన్ని సవాలు చేసిన విద్యార్థులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తీర్పుకు ముందు.. శివమొగ్గ డిప్యూటీ కమిషనర్ ఆర్ సెల్వమణి.. జిల్లాలో మార్చి 15 మంగళవారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆయన జిల్లాలో సిఆర్‌పిసి (నిషేధం) సెక్షన్ 144 విధించారు. ఈ ఉత్తర్వు మార్చి 15 ఉదయం 6 గంటల నుండి మార్చి 21 రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటుంది. తీర్పుపై ఎలాంటి వేడుకలు జరపకూడదనే ఆంక్షలు కూడా ఉన్నాయి. శివమొగ్గ నగరంలో ఎనిమిది కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు, ఒక రిజర్వ్ ఆర్మ్డ్ ఫోర్స్ ట్రూప్‌ను మోహరించినట్లు శివమొగ్గ పోలీస్ సూపరింటెండెంట్, బీఎమ్ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఇవాళ హిజాబ్ వివాదం తీర్పును దృష్టిలో ఉంచుకుని, కలబురగిలో మార్చి 14 సోమవారం రాత్రి 8 గంటల నుండి మార్చి 19 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉన్న సెక్షన్ 144 విధించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మార్చి 15వ తేదీ మంగళవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని కలబురగి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ యశ్వంత్ వి గురుకర్ తెలిపారు.