కర్ణాటకలో హిజాబ్ ల ఘటన ఉధృతమవుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. "శాంతి మరియు సామరస్యాన్ని కాపాడాలని నేను విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాలలు మరియు కళాశాలల యాజమాన్యంతో పాటు కర్ణాటక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే మూడు రోజుల పాటు అన్ని హైస్కూల్స్, కాలేజీలను మూసివేయాలని ఆదేశించాను. ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థిస్తున్నాను" అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం తెలిపారు.
పలు జూనియర్ కాలేజీల్లో హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు విచారణ ఈరోజు ముగిసింది. కేసు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఉడిపిలోని మహాత్మాగాంధీ మెమోరియల్ కాలేజీలో మంగళవారం కాషాయ కండువాలు ధరించిన విద్యార్థులు, హిజాబ్‌లు ధరించిన విద్యార్థులు పరస్పరం ఘర్షణకు దిగడంతో నిరసనలు చెలరేగాయి. ఉడుపి, చిక్కమగళూరులలో ముస్లిం బాలికలు తరగతి గదిలో కూడా హిజాబ్స్ ధరించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. శనివారం ఉడుపి కుందాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్' నినాదాలతో ర్యాలీలు నిర్వహించారు. హిజాబ్ ఆంక్షలను వ్యతిరేకిస్తూ ఐదుగురు బాలికల తరపున పిటిషన్ దాఖలైంది.