ఆ రాష్ట్రానికి అసలు వెళ్లొద్దు.. ఇక ముంబైలో మళ్లీ
Karnataka govt advises public to defer travel to Kerala till October end. కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే..!
By Medi Samrat Published on 9 Sept 2021 8:19 PM ISTకేరళ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే..! దీంతో పలు రాష్ట్రాలు అక్కడికి వెళ్లకండని ప్రజలకు సూచనలు ఇస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు నిపా వైరస్ కూడా కేరళను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిపా వైరస్‌తో 12 సంవత్సరాల బాలుడు మృతి చెందగా 68 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పొరుగున కర్ణాటక అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు అత్యవసరమైతే తప్ప అక్టోబర్ వరకు కేరళ వెళ్లడం మానుకోవాలని అధికారులు సూచించారు. అన్ని కళాశాలలు, పాఠశాలలు, విద్యా సంస్థల్లో విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరు కావొద్దన్నారు. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో నిపా వైరస్ వ్యాప్తి నివారణకు అడ్వైజరీని సైతం జారీ చేసింది. జ్వరం, మారిన మానసిక స్థితి, తీవ్రమైన బలహీనత, తలనొప్పి, శ్వాసకోశ ఇబ్బంది, దగ్గు, వాంతులు, కండరాల నొప్పి, మూర్ఛ, విరేచనాలు వంటి లక్షణాలతో కేరళ నుంచి వచ్చే వారిని పర్యవేక్షించాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.
కేరళలో గడిచిన 24 గంటల్లో 30,196 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం కరోనా బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 42,83,494కు చేరింది. గత శుక్రవారం నుంచి కేరళలో ఒక్కరోజులో 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన టెస్ట్ పాజిటివిటీ రేట్ (టీపీఆర్) మళ్లీ పెరిగింది. కొన్నిరోజులుగా 16 శాతం కన్నా తక్కువగా ఉన్న ఈ రేటు బుధవారం నాటికి 17.63 శాతానికి పెరిగింది.
ముంబైలో కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముంబైలో నిన్న 500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. జులై 15వ తేదీ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక గణేశ్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆందోళన పెరుగుతోంది.