రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ.. సిద్ధరామయ్య సర్కార్ సంచలన నిర్ణయం
కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 26 Sept 2024 6:13 PM ISTకర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో కేసుల దర్యాప్తులకు సంబంధించి సీబీఐ ఎంట్రీకి ఇచ్చిన అనుమతిని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు నిర్ణయాన్ని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ వెల్లడించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ కర్ణాటకలోకి ప్రవేశించడానికి వీల్లేదు.
సీబీఐ విచారణకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నామని హెచ్‌కే పాటిల్ తెలిపారు. రాష్ట్రంలో సీబీఐ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. చాలా కేసుల్లోనూ సీబీఐకి రిఫర్ చేశాం. కానీ ఛార్జ్ షీట్లు దాఖలు చేయలేదు. చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మేము పంపిన చాలా కేసులను విచారించడానికి కూడా వారు నిరాకరించారు. ఇలాంటి ఉదాహరణలు లెక్కలేనన్ని ఉన్నాయి. వారు పక్షపాతంతో వ్యవహరిస్తారు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ముడా స్కామ్ కారణంగా మేం ఈ నిర్ణయం తీసుకోలేదు. తప్పుడు మార్గాన్ని అవలంబించకూడదని మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాం అని పేర్కొన్నారు.
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డిఎస్‌పిఇ) చట్టం 1946లోని సెక్షన్ 6 ప్రకారం.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తన అధికార పరిధిలో దర్యాప్తు చేయడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అవసరం. DSPE చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం సీబీఐని ఏర్పాటు చేశారు. ఈ నిబంధన ప్రకారం.. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా DSPE సభ్యుడు అంటే CBI తన అధికారాలు, అధికార పరిధిని ఆ రాష్ట్రంలో ఉపయోగించలేదు.
నిజానికి కేంద్ర దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖపై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించాయి. కేంద్రంలోని అధికార బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను ఇరికించడానికి, వేధించడానికి బీజేపీకి ఈ ఏజెన్సీలు ఉపయోగించబడుతున్నాయని వారు పేర్కొన్నారు.