కర్ణాటకలో కోవిడ్ -19 ఆంక్షల ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన శనివారం నిపుణుల కమిటీతో సమావేశం జరగనుంది. పాఠశాలలను తిరిగి తెరవడం, థియేటర్లు, పబ్‌లు, బార్‌లు, హోటళ్లు మరియు రెస్టారెంట్‌లలో 50 పరిమితితో పాటు రాత్రి కర్ఫ్యూపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బెంగళూరులో కొత్త కోవిడ్ కేసుల సంఖ్య ఎక్కువగానే నమోదవుతున్నప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్యను మించిన రికవరీలు కూడా ఉండటంతో కొన్ని పరిమితులతో ఆంక్షలను ఎత్తివేయడానికి మార్గం సుగమం అయ్యింది.
కర్ణాటకలో శుక్రవారం 71,092 మంది కరోనా నుంచి కోలుకోగా.. 31,198 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరు అర్బన్ జిల్లాలో ఒక్కరోజే 15,199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 44,866 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజే యాభై మరణాలు నమోదయ్యాయి. రోజువారి పాజిటివిటీ రేటు 20.91 శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.16 శాతంగా ఉంది. ఇదిలావుంటే.. కర్ణాటక ప్రభుత్వం గత వారం వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసింది. పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయాన్ని శనివారం ప్రకటిస్తామని ప్రకటించింది. రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేయాలని వ్యాపార వర్గాల నుంచి ఒత్తిడి ఉంది. రాత్రి 11 గంటల వరకు పనిచేయనివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 50 శాతం సీట్ల పరిమితిని తొలగిస్తారని సినీ పరిశ్రమ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం బొమ్మై ఏం నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.