అప్పుడే నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని తీసుకువస్తాం : కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
Karnataka CM Bommai says Killed Student's Body Will Be Brought To India After Shelling Stops.ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో
By తోట వంశీ కుమార్
ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో గతవారం రష్యాబాంబు దాడిలో మరణించిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని రష్యా బలగాలు షెల్లింగ్‌ను నిలిపివేసిన తరువాత తీసుకువస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం తెలిపారు. ప్రస్తుతం శేఖరప్ప మృతదేహాన్ని ఎంబామ్ చేసి ఖార్కివ్‌లోని మార్చురీలో ఉంచినట్లు తెలిపారు.
"నవీన్ మృతదేహానికి ఎంబామ్ చేసి ఉక్రెయిన్‌లోని మార్చురీలో ఉంచినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాకు తెలియజేసారు. అక్కడ షెల్లింగ్ ఆగిన తర్వాత అతని మృతదేహాన్ని భారతదేశానికి తీసుకువస్తాము" అని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విలేకరులతో అన్నారు.
గత మంగళవారం ఖార్కివ్‌లోని ప్రభుత్వ భవనంపై రష్యా జరిపిన కాల్పుల్లో నవీన్ శేఖరప్ప (21) మరణించిన సంగతి తెలిసిందే. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో అతడు మెడిసిన్ చదువుతున్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి ప్రారంభించగానే అతడు అందరితో పాటు బంకర్‌లోకి వెళ్లిపోయాడు. అయితే.. ఆహారం కోసం బంకర్ నుంచి బయటకు వచ్చి ఓ కిరాణా షాపు వెలుపల క్యూలో నిలబడి ఉండగా.. రష్యా బాంబు దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
కాగా.. శనివారం నవీన్ శేఖరప్ప కుటుంబాన్ని సీఎం బసవరాజ్ బొమ్మై పరామర్శించారు. రూ.25 లక్షల చెక్కును అందజేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. నవీన్ మృతదేహాన్ని రెండు రోజుల్లో ఇంటికి తీసుకువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని నవీన్ తండ్రి శేఖరప్ప జ్ఞానగౌడ గత బుధవారం చెప్పారు. తన కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహకరించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని, కర్ణాటక ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.
అయితే.. మృతదేహం విమానంలో ఎక్కువ స్థలాన్ని తీసుకుంటుందంటూ శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య పెను వివాదాన్ని రేకెత్తించింది. విమానంలో మృతదేహాన్ని తీసుకురావాలంటే చాలా ఎక్కువ స్థలం కావాల్సి ఉంటుందని.. ఆ స్థలంలో మరో 8 నుంచి 10 మంది విద్యార్థులను తీసుకురావచ్చునని కర్నాటకలోని హుబ్లీ-ధార్వాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నబీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని ఎప్పుడు తీసుకువస్తారని ప్రశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. 'నవీన్ మృతదేహాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్ ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఉంది. అందరికీ దాని గురించి తెలుసు. అక్కడ చిక్కుకున్న విద్యార్థులను తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవీన్ మృతదేహాన్ని తీసుకువస్తాము. అయితే.. బతికి ఉన్న వారిని స్వదేశానికి తిరిగి తీసుకురావడం చాలా సవాలుగా మారింది. ఇక చనిపోయిన వారిని తీసుకురావడం మరింత కష్టంగా మారుతుంది. ఎందుకంటే మృతదేహం విమానంలో ఎక్కువ స్థలం తీసుకుంటుంది. ఆ స్థలంలో 8 నుంచి 10 మందిని తీసుకురావచ్చు అని అరవింద్ బెల్లాడ్ అన్నారు. కాగా.. అరవింద్ బెల్లాడ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.