కర్ణాటకలోని షిరహట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాణి రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ లోకాయుక్త పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. గడగ్ జిల్లాలో ఒక మైనర్ నీటి పారుదల ప్రాజెక్టుకు సంబంధించిన క్లియరెన్స్‌లు ఇచ్చేందుకు ఆయన మొత్తం రూ. 11 లక్షలు డిమాండ్ చేయగా, అందులో భాగంగా తొలి విడతగా రూ. 5 లక్షలు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
గడగ్‌కు చెందిన క్లాస్-1 కాంట్రాక్టర్ విజయ్ పూజార్ ఫిర్యాదు మేరకు లోకాయుక్త పోలీసులు శనివారం ఈ ట్రాప్ ఆపరేషన్ నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకులు మంజునాథ్ వాల్మీకి, గురునాయక్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, నిందితుల నుంచి కీలక ఆధారాలు సేకరించి దర్యాప్తును ముమ్మరం చేశారు.