Karnataka Assembly Elections : నేటి నుంచే ఎల‌క్ష‌న్ కోడ్ అమ‌లు.. ఎన్నిక‌లు ఎప్పుడంటే..

Karnataka Assembly Elections 2023. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నేడు ప్రకటించింది.

By Medi Samrat  Published on  29 March 2023 7:18 AM GMT
Karnataka Assembly Elections : నేటి నుంచే ఎల‌క్ష‌న్ కోడ్ అమ‌లు.. ఎన్నిక‌లు ఎప్పుడంటే..

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నేడు ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. కర్ణాటకలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 2.6 కోట్లు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2.5 కోట్లు. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే ద‌శ‌లో ఎన్నికలు జరగనున్నాయి. నేటి (మార్చి 29) నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎన్నిక‌ల కోడ్‌) అమలు కానుంది.

ఇదిలావుంటే.. కాంగ్రెస్ పార్టీ మార్చి 25న 124 మంది అభ్యర్థులతో ఇప్ప‌టికే తొలి జాబితాను ప్రకటించింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ నుంచి, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అంతకుముందు మార్చి 20న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 80 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని పార్టీ ప్రకటించింది.

కర్ణాటక శాసనసభ పదవీకాలం మే 24, 2023తో ముగియనుంది. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలు మే 2018లో జరిగాయి.


Next Story