కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. అతి త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే.. కాంగ్రెస్ అందరి కంటే ఓ అడుగు ముందుకు వేసింది. 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేర్లు ఉన్నాయి.
ఈ జాబితా ప్రకారం మాజీ సీఎం సొంత నియోజకవర్గమైన మైసూరులోని వరుణ అసెంబ్లీ స్థానం నుంచి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను కనకపుర నుంచి పోటీకి దిగనున్నారు. కొరటగెరె (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరను పార్టీ బరిలోకి దింపింది. మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప, ప్రియాంక్ ఖర్గే వరుసగా దేవనహళ్లి, చితాపూర్ (ఎస్సీ) నుంచి పోటీ చేయనున్నారు. ప్రియాంక్ ఖర్గే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు.
ఇక కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ గడువుకన్నా ముందే ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు చేస్తోంది.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 78 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు కైవసం చేసుకుంది.