తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యమ్(ఎంకెఎం) పార్టీ పొత్తులతో బరిలో దిగనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా జననాయక కట్చి, ఆలిండియా సమతువ మక్కల్ కట్చితో కలిసి బరిలో దిగుతున్నామని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ వెల్లడించారు. తమ పార్టీ 154 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కూటమిలోని రెండు పార్టీలకు తలో 40 స్థానాలు కేటాయించినట్లు తెలిపారు.
అటు, డీఎంకే తన కూటమిలోని పార్టీలకు సీట్ల కేటాయింపుపై స్పష్టతనిచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు పూర్తి కాగా... తాజాగా సీపీఎంకు ఆరు సీట్లను కేటాయించింది. మరో మూడు స్థానిక పార్టీలకు ఒక్కో స్థానాన్ని కట్టబెట్టింది. ఈ మూడు పార్టీలు డీఎంకే గుర్తుతోనే పోటీ చేస్తాయని పేర్కొంది. యూపీఏ,ఎన్డీయేలకు ప్రత్యామ్నాయంగా ఐజేకె,ఏఐఎస్ఎంకెలతో కలిసి కమల్ హాసన్ ఈ థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. కాగా, సీట్ల కేటాయింపులకు సంబంధించి కుదిరిన ఒప్పందంపై మక్కల్ నీది మయ్యమ్ ప్రధాన కార్యదర్శి సీకే కుమారవేల్, ఏఐఎస్ఎంకె వ్యవస్థాపకుడు శరత్ కుమార్,ఐజేకె నేత రవి పాచముత్తు సంతకాలు చేశారు.
మరోవైపు, టీటీవీ దినకరన్‌కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీతో ఎంఐఎం పార్టీ పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా ఎంఐఎం తమిళనాడులో మూడు స్థానాల్లో పోటీ చేయనుంది. వానియంబాడీ, శంకరాపురం, కృష్ణగిరిలో ఎంఐఎం బరిలో దిగనున్నట్లు ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు వకీల్ అహ్మద్ ప్రకటించారు.