మక్కల్ నీది మాయం పార్టీ అధినేత కమల్ హాసన్ శనివారం ఉదయం కోయంబత్తూరు గాంధీపార్క్ సమీప పూలమార్కెట్‌లో కాలినడకనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు వందలాదిగా అక్కడికి తరలివచ్చి సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. అదే ఇప్పుడు కమల్ కు ఇబ్బందులను తెలిచ్చిపెట్టింది. తొక్కిసలాట జరిగి కమల్ కాలికి గాయమైంది. అభిమానుల అత్యుత్సాహంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంతా ఒక్కసారిగా మీదపడి ఆయన కుడి కాలిని తొక్కేశారు. దీంతో తీవ్రమైన నొప్పితో కమల్ హాసన్ హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
ఆస్పత్రిలో ఆయన కాలికి స్కానింగ్ చేసిన వైద్యులు కంగారుపడాల్సిందేమీ చెప్పారు. వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోమని సూచించినట్లు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ నేతలు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే కోలుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో కుడి కాలి ఎముకలో ఇన్ఫెక్షన్‌తో కమల్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో వైద్యులు కాలికి శస్త్ర చికిత్స చేశారు. తాజాగా అదే కాలికి గాయం కావడంతో ఆయన నొప్పితో విలవిల్లాడారు. కమల్ హాసన్ ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీరోజూ స్థానికులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 154 స్థానాల్లో ఎంఎన్ఎం పోటీ చేయనుంది. మిగతా 80 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేయనున్నాయి.