యూపీ మాజీ సీఎం క‌ళ్యాణ్ సింగ్ క‌న్నుమూత‌

Kalyan Singh Passed Away. బీజేపీ సీనియ‌ర్ నేత, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్యాణ్ సింగ్ క‌న్నుమూశారు.

By Medi Samrat  Published on  21 Aug 2021 4:55 PM GMT
యూపీ మాజీ సీఎం క‌ళ్యాణ్ సింగ్ క‌న్నుమూత‌

బీజేపీ సీనియ‌ర్ నేత, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్యాణ్ సింగ్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 89 సంవ‌త్స‌రాలు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ శ‌నివారం రాత్రి క‌న్నుమూశారు. ల‌క్నోలోని సంజ‌య్ గాంధీ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కీలక పదవులు అలంకరించారు. 10 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ఎంపీగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గానూ ఆయన సేవలందించారు.

క‌ళ్యాణ్ సింగ్ కు కుమారుడు రాజ్‌వీర్‌ సింగ్‌, కుమార్తె ప్రభా వర్మ ఉన్నారు. ఆయన తనయుడు రాజ్‌వీర్‌ సింగ్‌ ప్రస్తుతం ఏత్‌ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. 1967లో అత్రౌలి నియోజకవర్గం నుంచి భారతీయ జన్‌సంఘ్‌ తరఫున పోటీచేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన క‌ల్యాణ్ సింగ్.. ఏకంగా 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలోనే 1977-79లో యూపీ ఆరోగ్యమంత్రిగా, రెండు పర్యాయాలు ముఖ్య‌మంత్రిగా సేవలందించారు. క‌ల్యాణ్ సింగ్ మృతితో బీజేపీలో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ధాని మోదీ త‌న సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.



Next Story