సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్
Justice Uday Umesh Lalit appointed 49th CJI, to succeed NV Ramana. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా
By Medi Samrat Published on 10 Aug 2022 8:07 PM IST
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులయ్యారు. కేంద్ర న్యాయ శాఖ సూచన మేరకు ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ U.U.లలిత్ పేరును తదుపరి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో భారత అత్యున్నత న్యాయస్థానం తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నియామకం ఈనెల 27వ తేదీన అమలులోకి రానుంది. ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ఈనెల 26వ తేదీతో ముగియనుంది. ఆ తరువాత రోజు జస్టిస్ యూయూ లలిత్ తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. భారత దేశ 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ యూయూ లలిత్.. ఆగస్టు 27న బాధ్యతలు తీసుకోనున్నారు. జస్టిస్ యూయూ లలిత్ కేవలం 74 రోజులు మాత్రమే ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయన నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు.
భారత రాజ్యాంగంలోని 124వ అధికరణంలోని క్లాజ్ (2) ద్వారా అందించబడిన అధికారాలను అమలు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనియామకాన్ని చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు నుండి సిఫార్సు ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన వారిలో జస్టిస్ యూయూ.లలిత్ రెండోవ వారు. ఈవిధమైన నియామకం పొందిన వారిలో 1971లో అప్పటి 13వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ మొదటివారు. జస్టిస్ యూయూ లలిత్ 1957, నవబర్ 9న జన్మించారు. 1983లో లీగల్ కెరీర్‌ను ప్రారంభించారు. 1985 డిసెంబర్ వరకు ముంబై హైకోర్టులో పని చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. 2004, ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. సుప్రీం కోర్టు జడ్జీగా నియమితులయ్యే వరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రత్యేక న్యాయవాదిగా పని చేశారు. 2014, ఆగస్టు 13న సుప్రీ కోర్టు జడ్జీగా నియమితులయ్యారు. ఆయన తండ్రి యూఆర్.లలిత్ సీనియర్ న్యాయవాదిగానూ, బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా సేవలందించారు.