తదుపరి సీజేఐగా జ‌స్టిస్‌ బీఆర్ గవాయ్

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా తన వారసుడిగా జ‌స్టిస్‌ BR గవాయ్‌ను అధికారికంగా సిఫార్సు చేశారు.

By Medi Samrat
Published on : 16 April 2025 3:08 PM IST

తదుపరి సీజేఐగా జ‌స్టిస్‌ బీఆర్ గవాయ్

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా తన వారసుడిగా జ‌స్టిస్‌ BR గవాయ్‌ను అధికారికంగా సిఫార్సు చేశారు. ఆమోదం కోసం ఆయన పేరును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపారు. ఈ సిఫార్సు జస్టిస్ గవాయ్ భారత 51వ ప్రధాన న్యాయమూర్తి అవడానికి మార్గం సుగమం చేస్తుంది. ప్రస్తుత చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేసిన ఒక రోజు తర్వాత అంటే మే 14న జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ క్ర‌మంలోనే సంప్రదాయం ప్రకారం జస్టిస్ గవాయ్‌ను తన వారసుడిగా పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపారు. వారసుడి పేరు పంపాల‌ని మంత్రిత్వ శాఖ గతంలో ప్రధాన న్యాయమూర్తిని కోరింది. జస్టిస్ గవాయ్ నవంబర్‌లో పదవీ విరమణ చేయనున్నందున దాదాపు ఆరు నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు.

మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఆయన 1985లో బార్‌లో చేరారు. మహారాష్ట్ర హైకోర్టు మాజీ అడ్వకేట్ జనరల్ మ‌రియు న్యాయమూర్తి బారిస్టర్ రాజా భోంస్లేతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత 1987 నుండి 1990 వరకు బొంబాయి హైకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ చేశారు. తదనంతరం బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ముందు ప్రధానంగా రాజ్యాంగ చట్టం, పరిపాలనా చట్టానికి సంబంధించిన విషయాలలో ప్రాక్టీస్ చేశారు. ఆగష్టు 1992లో బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, అదనపు గవర్నమెంట్ ప్లీడర్‌గా నియమితులయ్యారు. 2000లో నాగ్‌పూర్ బెంచ్‌కు ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులయ్యారు.

Next Story