గుజరాత్ పటిదార్ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని అగ్ర పారిశ్రామికవేత్తలైన ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలపై పదేపదే విమర్శలు గుప్పించడం సరికాదని అన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రం.. గుజరాత్ కు చెందిన వ్యక్తులు అనే కారణంతో వీరిని టార్గెట్ చేయకూడదని చెప్పారు. ప్రతిసారి అంబానీ, అదానీలను విమర్శించలేరని చెప్పారు. కాంగ్రెస్ లో ఉండి తాను మూడేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసుకున్నానని హార్దిక్ చెప్పారు. కాంగ్రెస్ లో లేకపోయినా గుజరాత్ కు తాను మరింత మెరుగైన సేవ చేస్తానని అన్నారు.
కాంగ్రెస్ నేతలు కూడా హార్దిక్ పటేల్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. హార్దిక్ పచ్చి అవకాశవాది అని.. ఆయనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్ శాసనసభ్యుడు జిగ్నేష్ మేవానీ హార్దిక్ పటేల్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న మేవానీ 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారికంగా పార్టీలో చేరాలని భావిస్తున్నారు. "మీకు పార్టీతో విభేదాలు ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ గుజరాత్ వ్యతిరేకం లేదా భారతదేశం వ్యతిరేకం అని అనడం తగదు" అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పటేల్‌కు అన్ని విధాలా మద్దతు ఇచ్చిందని, గుజరాత్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసిందని, ఆ పదవికి పటేల్ రాజీనామా చేశారన్నారు.